calender_icon.png 19 April, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడీకి వ్యతిరేకంగా నిరసనలు

17-04-2025 02:10:04 AM

  1. ఈడీ తీరును తప్పుబట్టిన కాంగ్రెస్
  2. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌పై ఈడీ చార్జ్‌షీట్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ చార్జ్‌షీట్ నమోదు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సామ్ పిట్రోడా, సుమన్ దూబేను కూడా ఈడీ సహ నిందితులుగా చేర్చింది. ఈడీ తీరుకు వ్యతిరేకంగా మంగళవారం కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే ఈ విషయంపై మాట్లాడారు. ‘12 సంవత్సరాల పాత కేసు ఇది. 12 సంవత్సరాలుగా ఏం జరగలేదు. వారు మనీలాండరింగ్ కేసు నమోదు చేసినా ఒక్కరూపాయి కూడా దొరకలేదు. ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. మేము వారిపై చివరి వరకూ పోరాడుతాం. బీజేపీ రాహుల్ గాంధీ రాజకీయాలు, ఆయన లేవనెత్తిన అంశాలు చూసి భయపడుతోంది.’ అని పేర్కొన్నారు. 

ఆ పత్రికను ఏటీఎంలా వాడుకున్నారు

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను ఏటీఎంలా వాడుకున్నారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇది కేవలం కేసుకు సంబంధించి నిరసన కాదు. ఇది తప్పును కప్పిపుచ్చే కుట్ర. కాంగ్రెస్‌కు నిరసన తెలిపే హక్కు ఉంది.

ప్రభుత్వ ఆస్తులను నేషనల్ హెరాల్డ్‌కు కట్టబెట్టే హక్కు లేదు. నేషనల్ హెరాల్డ్ ఒక స్వచ్ఛంద సంస్థగా ఉండాల్సింది. సంస్థ ఏం చారిటీ నిర్వహించింది. వేల కోట్ల ఆస్తులను దోచుకున్నారు.’ అని ఆరోపించారు. 

అక్రమ కేసులకు భయపడేదే లేదు: మహేశ్‌కుమార్‌గౌడ్ 

మా పేపర్‌కి మా పార్టీ డబ్బులు ఇస్తే మనీలాండరింగ్ ఎలా అయితదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈడీ అక్రమ కేసులకు నిరసనగా బుధవారం అన్ని రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఆదర్శనగర్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ వరకు నల్లజెండాలతో ర్యాలీ తీశారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ‘గాంధీ కుటుంబాన్ని అక్రమ కేసులతో తొంగదీసుకోవాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారు.

సోనియా,రాహుల్‌గాంధీలపై పెట్టిన అక్రమ కేసులకు భయపడేది లేదు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నేషన్ హెరాల్డ్ కేసులో అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసులతో దేశ ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతుంది.

దేశంలో ప్రతిపక్షాల మీద ఎన్నో అక్రమ కేసులను బీజేపీ సర్కార్ బనాయించింది.’ అని దుయ్యబటారు. ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే శ్రీగణేష్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.