- నటి మోక్షా సేన్‌గుప్తా పవర్‌ఫుల్ డ్యాన్స్
- ఎన్‌జీవో తరఫున దక్షిణ కోల్‌కతాలో వీధి ప్రదర్శన
- నెట్టింట వైరలవుతున్న వీడియో
కోల్‌కతా (పశ్చిమబెంగాల్), సెప్టెంబర్ 17: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ దేశమంతటా ముఖ్యం గా కోల్‌కతాలో నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ నిరసనల్లో భాగంగా ఓ ఎన్‌జీవో ఆధ్వర్యలో దక్షిణ కోల్‌కతాలో ఇటీవల నిర్వహించిన ఓ వీధి ప్రదర్శనలో వెండితెర నటి, డ్యాన్సర్ మోక్షాసేన్ గుప్తా చేసిన పవర్ ఫుల్ డ్యాన్స్ వైరల్‌గా మారింది.
ఆడది భద్రకాళి అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో తన హావభావాలతో మోక్ష చేసిన నృత్యంలో స్పష్టంగా కనిపిస్తోంది. అభయ హత్యాచార నిందితులకు శిక్ష పడాలని.. అందులో భాగంగా తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు మోక్ష మీడియాకు వెల్లడించింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తు న్నారు. ‘శభాష్ మోక్ష’, ‘కీప్ గోయింగ్,’ ‘వీ వాంట్ జస్టిస్’ వంటి ట్యాగ్‌లైన్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ఉపాధ్యాయురాలిగా కెరీర్ ఆరంభం..
కోల్‌కతా వీధి ప్రదర్శనతో తళుక్కున మెరిసిన మోక్షా సేన్ గుప్తా వివరాల గురిం చి ఇప్పుడు నెటిజన్లు ఆన్‌లైన్లో తెగ వెతికేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నటి కమ్ డ్యాన్సర్ మన తెలుగు ప్రజలకు సుపరిచితురాలే. తెలుగులో ఇప్పటికే ఈ నటి మూడు సినిమాల్లో నటించింది. నీతోనే నేను, అలనాటి రామచంద్రుడు, ఐహేట్‌యూ వంటి చిత్రాల్లో నటిచింది మోక్ష.
త్వరలో ధన్‌రాజ్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామం రాఘవం చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది మోక్ష. కెరీర్ తొలినాళ్లలో ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మోక్ష తర్వాత నటన వైపు అడుగులు వేశారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తన స్వరాష్ట్రంలోని బెంగాళీ చిత్రపరశ్రమలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.