calender_icon.png 21 October, 2024 | 1:43 PM

ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందువులపై లాఠీచార్జిని నిరసిస్తూ...

21-10-2024 11:57:22 AM

గజ్వేల్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు 

గజ్వేల్ (విజయక్రాంతి): సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందువులపై లాఠీ చార్జిని నిరసిస్తూ గజ్వేల్ లో బిజెపి నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి మండల, పట్టణ శాఖల ఆధ్వర్యంలో నాయకులు సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా బిజెపి నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. ముత్యాలమ్మ ఆలయంలో దాడికి పాల్పడిన మతోన్మాదులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఆలయం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన హిందువులపై లాఠీచార్జి చేసిన అధికారులను సస్పెండ్ చేసి హిందువుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హిందువులపై దాడులు ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. గత సీఎం కేసీఆర్ నిజాం తరహాలో అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్వేల్ అధ్యక్షుడు పంజాల అశోక్, పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, సీనియర్ నాయకులు జశ్వంత్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఐల మహేందర్, నాయిని సందీప్, రాజశేఖర్ రెడ్డి, కుడిక్యాల రాములు, సురేష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.