30-03-2025 12:21:47 AM
రాచరిక పాలన కోసం మాజీ రాజు జ్ఞానేంద్ర షా మద్దతుదారుల డిమాండ్..
రాళ్లదాడి, పలు వాహనాలకు నిప్పు..
అల్లర్లలో ఇద్దరు మృతి.. 112 మందికి గాయాలు..
న్యూఢిల్లీ: నేపాల్‌లో తిరిగి రాచరిక పాలనను ప్రవేశపెట్టాలంటూ ఆందోళనలు చేసిన 105 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పరిస్థితి అదుపులోకి రావడంతో శుక్రవారం ఖాట్మాండులోని పలు ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను ఎత్తేశారు. కాగా నేపాల్‌లో తిరిగి రాచరిక పాలనను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ రాజు జ్ఞానేంద్ర షా మద్దతు దారులు దేశ రాజధానిలో ఆందోళనలు చేశారు. రాళ్లు రువ్వడంతో పాటు రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టి, వ్యాపార సముదాయాల్లో చొరపడి దొపిడికి పాల్పడ్డారు. నిరసనకారులు జరిపిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా సుమారు 112 మంది గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు శుక్రవారం సాయంత్రం నగరంలో కర్ఫ్యూ విధించారు. శనివారం ఉదయం నాటికి పరిస్థితి అదుపులోకి రావడంతో కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.