28-03-2025 06:53:59 PM
కాటారం,(విజయక్రాంతి): వక్ఫ్ సవరణ బిల్లు 2024కి నిరసనగా రంజాన్ చివరి శుక్రవారం అల్విదా జుమా నాడు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు చేతికి నల్లటి బ్యాండ్లు, బ్యాడ్జీలు ధరించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) ఇచ్చిన పిలుపునిచ్చింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం మస్జిద్ కు నల్లటి బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ఈ సందర్భంగా గారేపల్లి మస్జిద్ అధ్యక్షులు షేక్ అమీర్ మాట్లాడుతూ... ఈ బిల్లు ముస్లింల మసీదులు, ఈద్గాలు, మదర్సాలు, దర్గాలు, ఖాన్ఖాలు, స్మశానవాటికలు, ధార్మిక సంస్థలను లాక్కునేందుకు ఉద్దేశించిన కపటకుట్రగా పేర్కొన్నారు. ఈ బిల్లుని వ్యతిరేకించడం దేశంలోని ప్రతి ముస్లిం బాధ్యత అని అన్నారు. జుముఅతుల్ విదా ఉన్నందున మసీదుకు వచ్చే సమయంలో ముస్లింలందరూ నల్లటి బ్యాండ్ ధరించి శాంతియుతంగా, మౌనంగా నిరసన తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, ముస్లిం సోదరులు, యువత తదితరులు పాల్గొన్నారు.