సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్...
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా అన్ని విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్షను వీడాలని, జరిగిన అగ్రిమెంట్ అంశాలను అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏరియాలోని అన్ని విభాగాలలో కాంట్రాక్టు కార్మికులు సోమవారం నల్ల బ్యాడ్జిలను ధరించి విధులు నిర్వహిస్తూ, నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్సీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం అనే నినాదంతో సింగరేణి యాజమాన్యం గొప్పగా ప్రచారం చేసుకుంటుంది తప్ప ఆచరణలో పూర్తిగా విఫలమైందని సింగరేణిలో అధికారుల కుటుంబం, పర్మినెంట్ కార్మికుల కుటుంబం, కాంట్రాక్టు కార్మికుల కుటుంబం అంటూ యాజమాన్యం విభజించి పాలించు అనే విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులంటే కట్టు బానిసలుగా, రెండవ తరగతి పౌరులుగా అడుగడుగునా వివక్షతని చూపిస్తుందని మండిపడ్డారు. కోల్ ఇండియా వేతనాల అమలులో, కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించడంలో, క్యాంటీన్ సౌకర్యం, పండగ, జాతీయ సెలవుల అమలులో, వృత్తి పన్ను మినహాయింపులు, ఖాళీ క్వార్టర్లు ఇప్పించడంలో, కేటగిరి ఆధారంగా వేతనాలు ఇవ్వడంలో, మైన్స్ చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం, ఇతర చట్టాల అమలు, స్వీట్స్ పంపిణీలో, వేతనాలను సకాలంలో చెల్లించడంలో, ఇలా ప్రతి విషయంలో కాంట్రాక్టు కార్మికులపైన యాజమాన్యం వివక్షను, నిర్లక్ష్యమే ప్రదర్శిస్తుందని యాజమాన్యం తీరుపై విరుచుకుపడ్డారు.
అడుగడుగునా కాంట్రాక్టు కార్మికులపై సింగరేణి యాజమాన్యం వివక్షను, నిర్లక్ష్యాన్ని పాటిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల విషయంలో సానుకూలంగా ఉన్నామంటూనే, తీయటి మాటలు చెబుతూ, వారి వేతనాలు పెంపుదలపై, సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి ఆవిర్భావ వేడుకల సందర్భంగా నల్ల బ్యాడ్జీలు నిరసన డిమాండ్ల బ్యాడ్జీలతో కాంట్రాక్టు కార్మికులు నిరసన కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేశారని కార్మికులకు విప్లవ వందనాలు తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికుల విషయంలో స్పందించి, సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు రావాలని, లేని యెడల మరో మహత్తర పోరాటానికి కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.