25-03-2025 01:14:44 AM
కొండపాక, మార్చి 24:సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, రైతులకు సాగునీరు అందించాలని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. సంఘం జిల్లా అధ్యక్షులు జస్వంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పొలాలకు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు.
ఎండిపోగా మిగిలింది కాస్త ఉన్న పంటలు గత రెండు మూడు రోజుల నుంచి వడగళ్ల వర్షాలు పడటంతో రైతులం పూర్తిగా నష్టపోయామని అన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.30వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నక్షదారి ఆక్రమణ...కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామస్తులు ఏటిగడ్డ ఎల్లమ్మ బ్రిడ్జి నుంచి దుద్దెడ ఆదిపర్మల్ల హనుమాన్ గుడి వరకు నిజాం కాలం నుంచి ఉన్న నక్షమార్గం ఉండగా, దీనికి ఇరువైపులా సుమారు 100 మంది రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ప్రతిరోజు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం కొండపాక తహసిల్దార్ కు పిర్యాదు చేసి తొమ్మిది నెలలు గడుస్తున్న సమస్యను పరిష్కరించలేదని రైతులు బాధిత రైతులు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు.
ప్రజావాణిలో కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్ లు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పెన్షన్లు మొత్తం 71 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.