05-03-2025 06:56:46 PM
ఖాళీ బిందెలతో కలెక్టరేట్ ఎదుట నిరసన..
మద్దతు పలికిన ప్రజా సంఘాలు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తమ గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ వాంకిడి మండలంలోని పాటగూడ గ్రామపంచాయతీ కొలాంగూడ గ్రామానికి చెందిన ప్రజలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కుమ్రం భీం చౌక్ నుండి కాళీ బిందెలతో ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట గంటకు పైగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొలంగూడా గ్రామంలో త్రాగునీటి సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామంలో సుమారుగా 25 కుటుంబాలు 200 మంది ప్రజలు నివసిస్తున్నారని, గ్రామంలో బోర్లు ఉన్నప్పటికీ అవి సరిగ్గా పనిచేయక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో జిల్లా కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ దృష్టికి కూడా సమస్య తీసుకువెళ్లారని ఆయనప్పటికీ పరిష్కారం కాకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఓవైపు ప్రభుత్వాలు ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని ప్రకటించుకుంటున్నాయని క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు. బిందెడు నీటి కోసం అర్ధరాత్రి లేచి బోరింగ్ ఉపయోగించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. సమస్య పరిష్కారం కొరకు అధికారులు స్పందించే వరకు నిరసన విరమించేది లేదని భీష్ముంచుక కూర్చుండడంతో కలెక్టరేట్ ఏవో మధుకర్, మిషన్ భగీరథ డిఈ ఇర్ఫాన్ అక్కడికి చేరుకొని సమస్య పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కోరెంగ మలశ్రీ, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గెడం టీకానంద్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు చాపిడి శ్రావణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమాచారి, వీటిడిఏ ఉపాధ్యక్షుడు సీడం పగ్గు, కొలాం సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం జలపతి, గ్రామ పటేల్ ధర్ము, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.