04-04-2025 07:27:59 PM
రోస్టర్ నిబంధనలను పాటించలేదని ఆరోపణలు
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ ల డిమాండ్
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించారని తెలుగు నాడు విద్యార్థి సమైక్య (టీఎన్ఎస్ఎఫ్), తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ... 50 ఉద్యోగాల కోసం 700 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే అందులో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని, ఇచ్చిన ఉద్యోగాలు ఏ ప్రాతిపదికన ఇవ్వడం జరిగిందో ఆ వివరాలను ఇప్పటికి కూడా బయట పెట్టడం లేదని, ఏజెన్సీ రద్దు అవుతుందనే ఉద్దేశంతో రెండు రోజుల ముందే నియామకాలు రాత్రికి రాత్రి చేశారని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు మార్గంలో ఉద్యోగాలను పొందిన వారిని తొలగించకపోతే హైకోర్టును ఆశ్రయించి అర్హులకు న్యాయం చేసే వరకు పోరాడుతామన్నారు. అనంతరం మెడికల్ కళాశాల ఎదుట ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, నవీన్, సంతోష్, సందీప్, బాలకృష్ణ, ప్రభు, విష్ణువర్ధన్, నవనీత్, రాహుల్, రంజిత్, సాయి, అంజి, తదితరులు పాల్గొన్నారు.