మంచిర్యాల, విజయక్రాంతి : హైదరాబాదులో జరుగుతున్న అమరణ నిరాహార దీక్ష కు మద్దతుగా బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో బీసీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఇందుకోసం హైదరాబాదులో బిసి రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర, బీసీ ఆజాద్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గాడ్గే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని, ఆరో రోజుకు దీక్ష చేరుకున్నప్పటికీ ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బీసీలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తుందన్నారు.
వారి దీక్షకు మద్దతుగా మంచిర్యాల జిల్లాలో బీసీ ఐక్య కారుణ్య కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగిందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మద్దతుగా తన గళాన్ని బిజెపికి వ్యతిరేకంగా వినిపియడం జరుగుతుంది.కానీ తెలంగాణలో బీసీల ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వర్గాన్ని కాపాడుకుంటూ బీసీలను అణగదొక్కడానికి, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే ముందుకు పోవడానికి, బీసీలు అంటేనే లెక్క లేకుండా తన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముందుకు పోతే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతామన్నారు.
నిరాహార దీక్ష చేస్తున్న బీసీ నాయకులకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం స్థానిక సంస్థలు ఎన్నికలలో రిజర్వేషన్ కేటాయించాలని, తెలంగాణలో సమగ్ర కుల గణన చేసి బీసీల శాతాన్ని లెక్కించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్, జాతీయ బీసీ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, సామాజిక న్యాయవేదిక జిల్లా అధ్యక్షులు రంగు రాజేశం, రిటైర్డ్ ఎంఈఓ బీసీ నాయకులు శ్రీరాముల కొండయ్య, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నస్పూరి అఖిల్, బీసీ ఐక్యవేదిక యవజన జిల్లా అధ్యక్షుడు పెద్దల చంద్రకాంత్, బీసీ సంక్షేమ సంఘం యువజన నాయకులు పిట్టల రవి, బీసీ నాయకులు శాఖ పూరి భీమ్ సేన్, రామగిరి రాజన్న చారి, పంపరి వేణుగోపాల్, ఎండి లతీఫ్,చంద్రగిరి చంద్రమౌళి అంకం సతీష్ తదితరులు పాల్గొన్నారు.