07-03-2025 01:39:39 AM
ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నిర్వాసిత రైతుల ర్యాలీ
బెల్లంపల్లి, మార్చి 6 (విజయక్రాంతి) : బెల్లంపల్లి శాంతిఖని గని - 2 లాంగ్ వాల్ ప్రాజెక్ట్ విస్తరణ కోసం గురువారం శాంతిఖని గని వద్ద మంచిర్యాల అసిస్టెంట్ కలెక్టర్ సభావత్ మోతిలాల్, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్ ప్రసాద్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో నిర్వాసిత గ్రామాల రైతుల నుండి వ్యతిరేకత ఎదురైంది.
ఉదయం 11 గంటలకు నిర్వహించిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ లో ఎక్కడ గొడవలు జరగకుండా మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ నేతృత్వంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తో పాటు 80 మంది పోలీసులు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. సింగరేణి జిఎం స్థాయి అధికారి నోటి నుండి శాంతిఖని గని ఓపెన్ కాస్ట్ గా మారుతుందన్న ప్రచారం ప్రజాభిప్రాయ సేకరణ పై పెను ప్రభావాన్ని చూపింది.
నిర్వాసిత లింగాపూర్, ఆకెనపల్లి, పెరిక పల్లి, బట్వాన్పల్లి, బుచ్చయ్యపల్లి, పాత బెల్లంపల్లి, గురిజాల గ్రామాల నుండి రైతులు లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీగా తరలివచ్చారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నిర్వాసిత రైతులు తమ ఆందోళనను విరమించలేదు. లాంగ్ వాల్ ప్రాజెక్ట్ అడ్డుకోవడంలో ప్రాణ త్యాగాలకైనా సిద్ధమేనంటూ తేల్చి చెప్పారు.
ప్రజాభిప్రాయ సేకరణ నిర్వాసిత రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా చేపట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. గతంలో మౌలిక వసతుల కల్పన పేరుతో నిర్వాసితులను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ప్రభావిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండా కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య గని పరిసరాల్లో ఏర్పాటు ఎందుకు చేశారంటూ సింగరేణి అధికారులను నిలదీశారు.
సింగరేణి అధికారుల బిడ్డలు విదేశాల్లో స్థిరపడుతున్నారని, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు మాత్రం తమ గ్రామాలను నమ్ముకుని బతుకుతున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. సింగరేణికి భూములను విధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. కేకే -5 ని ఎందుకు మూసేస్తున్నారని, దీనిపై సింగరేణి ఎందుకు దృష్టి పెట్టడం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
శాంతిఖని గని 2 లాంగ్ వాల్ ప్రాజెక్ట్ విస్తరణ వల్ల బెల్లంపల్లి మండలంలోని 16 వందల ఎకరాల వ్యవసాయ భూములు విధ్వంసానికి గురై ప్రమాదం వాటిల్లుతుందని అన్నారు. కన్నతల్లి లాంటి గ్రామాలను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందని ఆయన అన్నారు. నిర్వాసిత గ్రామాల రైతులందరూ లాంగ్ వాల్ -2 ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయ సేకరణలో తమ గళాన్ని వినిపించారు.
నిర్వాసిత రైతుల అభిప్రాయాలను కాదని ఎవరైనా లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణకు మద్దతు గా నిలిస్తే పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని, ప్రాణ త్యాగాలకు వెనుకాడబోమని హెచ్చరిస్తూ సమావేశం లో నుండి వెళ్లిపోయారు. కొద్దిమంది అధికారులు, కార్మిక సంఘాల నాయకులు లాంగ్ వాల్ ప్రాజెక్ట్ విస్తరణ కు అనుకూలమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కాగా ప్రభావిత గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని, మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు సాగునీటి వసతులు మెరుగుపరిచేలా ప్రాజెక్టు వాటర్ ను చెరువుల్లోకి మళ్లించే ఏర్పాట్లు చేపడతామని మందమర్రి జిఎం జి. దేవేందర్ ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టం చేశారు.