05-04-2025 12:43:29 AM
తెలంగాణ గిరిజన సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్
ముషీరాబాద్,(విజయక్రాంతి): ట్రైకార్ లో 2019-21 సంవత్సరాల్లో మంజూరి అయి చెక్కులు సిద్ధంచేసి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడని లబ్ధిదారులు ఏప్రిల్ 7న హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ గిరిజన సంక్షేమ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజీవ్ యువ వికాసం పేరుతో నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించడం వలన ట్రై కార్ సంస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందని అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా 2019-2021 సంవత్సరాల్లో గిరిజన యువతి యువకుల నుండి వేలాది దరఖాస్తులను స్వీకరించి అందులో నుండి 30 వేల మందికి రుణాలను మంజూరు చేస్తూ లబ్దిదారులుగా గుర్తించిందన్నారు.
వీరి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి 219 కోట్ల రూపాయల చెక్కులను రెడీ చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని హామీ ఇవ్వడంతో లబ్దిదారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కొరకు కొత్తగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి వెళితే ఇప్పటికే రుణాలు తీసుకున్నట్టు చూపిస్తూ ఆన్ లైన్ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని ఆరోపించారు. దీనితో వేలాది మంది గిరిజన యువత రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాలు పొందకుండా అనర్హులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల మంది యువతకు రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పేరుతో నూతన పతకాన్ని ప్రారంభించి మోసం చేయడం తగదన్నారు.