బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం
కోరుట్ల, జనవరి 24 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని 21వ వార్డులో శుక్రవారం ప్రజాప్రాలన గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల సెగ్మెంట్ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా, నర్సింగరావు అక్కడికి రాగా ’ప్రోటోకాల్ ప్రోగ్రాంకు నువ్వెట్లా వస్తావు’ అని ఎమ్మెల్యే అనడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో చేపడుతున్న సంక్షేమ పథకాల అమలులో సీఎం రేవంత్’రెడ్డి గురించి మాట్లాడకుండా కేసీఆర్ గురించి మాట్లాడడం ఏంటని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ ఉపన్యాసాన్ని అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు.
గ్రామసభలో తోపులాట
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో శుక్రవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభలో కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నాయకుల మధ్య తోపులాట ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సంజయ్ హాజరై మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరిస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమందికి ఏమి ఇచ్చారని ప్రశ్నించారు. దాంతో టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, నాయకులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, నాయకుల మధ్య కొంత సేపు తోపులాట జరిగింది. దీంతో ఎమ్మెల్యే సంజయ్ అక్కడి నుండి వెళ్లిపోయారు.