14-12-2024 12:00:00 AM
విశ్వ వ్యాప్తంగా వాతావరణం వేడె క్కి కాలుష్యం కబళిస్తోందనీ ప్రతి నిత్యం వింటూనే ఉన్నాం. దీన్ని నివారించాలంటే వేడిని, కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అన్నింటి గురించి తెలుసుకొని మన వంతుగా బాధ్యతాయుతంగా ఉండవలసిన అవసరం ఉంది. అధిక ఉష్ణోగ్రత లు, కాలుష్య కారకాలకు తప్పనిసరిగా అడ్డుకట్ట వేయాలి. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి జాతీయ ఇంధన పరి రక్షణ దినోత్సవం ఏటా డిసెంబరు 14న జరుపుకుంటారు. 1991లో ఈ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ప్రారంభించబడింది.
2001లో భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టా న్ని తీసుకురావడమే కాకుం డా, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. వనరులను సర్గిగా వినియోగించడం వల్ల పర్యావరణానికీ, జీవావర ణానికీ ఏ రకం గా మేలు జరుగుతుందో ప్రజలలో అవగాహన కల్పించడం,వీటిని అధికంగా వినియోగించడం వల్ల కలిగే అనర్థాలను తెలియచేయడం, అవసరానికి మించి అడవుల ను తొలగించడం వల్ల, గనుల తవ్వకాలు, ప్రధానంగా బొగ్గు, చమురు, సహజ వాయువుల వెలికితీత లాంటివి అత్యధికంగా చేయడం వల్ల కలిగే అనర్థాలను తెలుపడం ముఖ్య ఉద్దేశంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఇంధనాలను మండించడం వల్లే..
భూమి వేడెక్కకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరిది. భూ అంతర్భాగం లో మనకు అవసరమైన వాటి కొరకు ఇంధనాలను మండించడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడం భూమి వేడెక్కడానికి ప్రధాన కారణం. ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా మానవ జనాభా నాగరిక జీవనాన్ని గడపడానికి విద్యుత్తును వినియోగిస్తోంది. ప్రజల అభివృద్ధితో పాటుగా వనరుల వినియోగం కూడా పెరుగుతూ వస్తోంది. కాబట్టి విద్యుత్ ఉత్పత్తికి ముఖ్యవనరులైన బొగ్గు, చము రు, సహజ వాయువుల ఉత్పత్తులు, అణుశక్తిని ఉపయోగించడం సహజం అయిం ది. అయితే వీటివల్ల వాతావరణ కాలు ష్యం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో పాటు గా ఈ సహజ వనరులు అడుగంటి పోయే ప్రమాదమూ ఉంది. అందువల్ల వీటిని పక్కన పెట్టి సూర్యరశ్మి, గాలి, సముద్ర అలలు, తదితర మార్గాల ద్వారా అతి తక్కువ కాలుష్యంతో, ఉష్ణోగ్రతలు పెంచకుండా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి సిద్ధం కావలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కోసం బొగ్గు, చమురు, సహజ వాయువులను విపరీతంగా మం డించి ప్రపంచ వాతావరణ అత్యవసర పరిస్థితి తెచ్చుకున్నాం. వాస్తవానికి సూర్యరశ్మి ఆధారంగా, గాలి మరల ద్వారా కూడా విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. మన దేశంలో 8 వేల కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఈ తీరంలో సముద్ర అలల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రత్యామ్నా యాలు ఉండగా ప్రపంచ వాతావరణం వేడెక్కి అత్యవసర పరిస్థితి ఎందుకు తెచ్చు కుంటున్నామో ఆలోచించాలి. ప్రస్తుత పరిస్థితి నుండి వాతావరణం చల్లబడేలా చర్యలు చేపట్టాలి.
తగ్గిపోతున్న ప్రాణవాయువు
2014 నుండి ప్రతి సెకనుకు వెయ్యి టన్నుల వంతున ప్రాణ వాయువు తగ్గిపోతోంది.ప్రస్తుతం వాతావరణంలో 23.5 శాతం నుండి ప్రాణ వాయువు శాతం 20.9 శాతానికి చేరుకుంది. ఇది 19.5 శాతం కన్నా తగ్గితే జీవావరణం మనగలగడం చాలా కష్టం అని ఎంత మంది శాస్త్ర వేత్తలు చెప్పిన మనం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం లేదనేది సత్యం. ప్రాణ వాయువు ఉత్పత్తి పెరిగేందుకు అవసరమైన కృషి చేయాలని శాస్త్రజ్ఞులు చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నారు. 2016 పారిస్ ఒప్పందంలో సైతం శాస్త్రవేత్తలు వాతావరణం చల్లబడటానికి అవసరమైన చర్యలు చేపట్టాలనీ, వాతావరణం వేడెక్కడాన్ని తగ్గించాలనీ, కర్బన ఉద్గారాలు తగ్గించాలనీ, లేకుంటే పెనుముప్పు ఏర్పడుతుందనీ హెచ్చరించారు. ఈ ఒప్పందం మీద 175 దేశాలు సంతకం పెట్టి అమలు చేస్తామన్నాయి. కానీ ఆచరణలో అంతంత మాత్రంగానే ఉంది. భూమిలో ఇంధన రూపంలో మగ్గుతున్న కార్బన్ నిల్వలను వెలికి తీసి వాయు రూపంలోని కార్బన్ డయాక్సైడ్‌గా మార్చివేస్తున్నాం.
ఇది వాతావరణాన్ని వేడెక్కించేసి ప్రపంచంలో పెనుమార్పులు తెస్తోంది.160కు పైగా దేశాలకు చెందిన దాదాపు పన్నెండు వేల మంది శాస్త్రవేత్తలు ప్రస్తుతం ప్రపంచం వాతావరణ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా రానున్న పరిస్థితులను దృష్టిలోనికి తీసుకుని 2019 మే 1న బ్రిటన్ మొదటగా ప్రపంచ వాతావరణ అత్యవసర పరి స్థితి ఏర్పడిందని ప్రకటించింది. వాతావరణం వేడెక్కిపోవడం వల్ల విభిన్న జీవ జాతులు అయిదు శాతం తగ్గిపోయాయనీ ఇదే విధంగా కొనసాగితే ఇంకా అధిక మొత్తంలో తగ్గిపోయే ప్రమాదం ఉందని ముందస్తు హెచ్చరికలు చేసినా కూడా పరిస్థితిని చక్కబెట్టడం కోసం తీవ్ర ప్రయ త్నాలు చేయడం లేదు.
ప్రమాద స్థాయికి ఉష్ణోగ్రతలు
పారిశ్రామికీకరణకు ముందు రోజులతో పోలిస్తే రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించి ప్రపంచ ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలన్నది లక్ష్యంగా ప్యారిస్ లో జరిగిన ‘కాఫ్ 2021’లో ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. వరుసగా పెరుగుతున్న వాతావరణ పరిస్థితుల ఘటనలు ప్రపంచం మొత్తాన్ని అప్రమత్తం చేశాయి. పర్యావరణ ప్రభావంతో భూగోళం రోజురోజుకు భయాందోళన కలిగించే దిశగా పయనిస్తున్నదని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రమాదకర స్థాయికి చేరిందనీ, 1850 నుండి1900 మధ్య కాలం కన్నా ఇపుడు ప్రతి రోజు కనీసం ఒక డిగ్రీ అధికంగా ఉందనీ పరిశోధకులు తేల్చారు.
ఈ వాతావరణ అత్యవసర పరిస్థితి నుండి బయట పడటానికి కర్బన ఉద్గారాలు సమూలంగా తగ్గించుకోవాలని ఐక్యరాజ్య సమితి పేర్కొంటోంది. అందు కు అవసరమైన అవగాహన అందరిలో కలిగించాలనీ,శిలాజ ఇంధనాలను తగ్గించుకోవడానికి తప్పనిసరిగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమిని మరణం వైపు కాకుండా జీవావరణంతో కళకళలాడే విధంగా చూడాలని, ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని నగరాల్లోను ప్రజల్లోను కదలిక రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నగరాలు ఎదుర్కొంటున్న అత్యవసర పరిస్థితి మిగిలిన ప్రాంతాలకు పాకక ముందే ప్రతి ఒక్కరూ స్పందించి,యుద్ధ ప్రాతిపదికన వాతావరణం చల్లబడేందుకు అవసరమైన కార్యా చరణ ప్రణాళికలు అన్ని నగరాల్లో చేయవలసిన పరిస్థితి మన ముందుంది.
స్వలాభం, అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసాన్ని సృష్టించడంలో పోటీని ఆపి, పర్యావరణ హితంగా అభివృద్ధి పను లు చేపట్టి, తక్షణమే వాతావరణం చల్లబడటానికి అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేయాలి. ఇంతటి విపత్తు గురించి అందరికీ తెలియచేయడం కొరకు జరుపుకొనే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ రోజున ఇంధన పరిరక్షణకు కృషి చేసిన వివిధ పరిశ్రమలు, కంపెనీల ఇండస్ట్రియల్ యూనిట్లకు, హోటళ్ళకు, ఆసుపత్రి భవనాలకు, కార్యాలయాలకు, షాపింగ్ మాల్ బిల్డింగులకు, జోనల్ రైల్వే, రాష్ట్ర సంబంధ ఏజెన్సీలు, మున్సిపాలిటీలు, థర్మల్ పవర్ స్టేషన్లకు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా చేయూత నివ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త సెల్: 9963499282