బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో మహిళలపై నానాటికి దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలతో కలిసి బుధవారం ఆమె మహిళల రక్షణ కోరుతూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ నాయకులను అణచివేయడంపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని మండిపడ్డారు. మహిళల భద్రతపై అసెంబ్లీలో చర్చ పెట్టకపోవడం దారుణమన్నారు. మహిళల భద్రతను గాలికి వదిలేసి, కాంగ్రెస్‌లో చేరికలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లైంగిక దాడులకు గురైన బాధితులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. వెంటనే రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని నియమించాలని ఆమె డిమాండ్ చేశారు.