calender_icon.png 17 October, 2024 | 11:09 PM

ప్రైవేటు ఉద్యోగులకు సంరక్షణ చట్టం తేవాలి

17-10-2024 08:27:16 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం సంరక్షక చట్టం తేవాలని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు గురువారం అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఆయన ప్రచారo నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత తరుణంలో రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ప్రైవేటు కళాశాలలు నిరవధిక బందును కొనసాగిస్తున్నాయని అన్నారు. రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా మంజూరు చేస్తే ప్రైవేటు కళాశాలల యజమాన్యాలు ఉపాధ్యాయులు బాగుపడతాయని అన్నారు.

అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉన్నత చదువులు చదవడం కోసం రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని దానిని ప్రతి ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో చదువుకునే వ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉండాలని ఒక దేశాన్ని నాశనం చేయాలంటే మిసైల్ లో అవసరం లేదని కేవలం చదువులేని పిల్లలు ఉంటే సరిపోతుందని అన్నారు. అందుకే ప్రభుత్వం రియంబర్స్మెంట్ను విడుదల వారీగా మంజూరు చేస్తే విద్యావ్యవస్థలు బాగుపడతాయని అన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం సరైన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని దాంతో వారు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ఒక ఉద్యోగి ఎప్పుడు రిటైర్మెంట్ అవుతుందో ముందే తెలుస్తుంది కావున ఆ ఉద్యోగికి సంబంధించిన అన్ని రకాల బెనిఫిట్స్ రిటైర్మెంట్ రోజు ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని అన్నారు. 

ప్రైవేటు ఉద్యోగుల సంరక్షణ చట్టం తేవాలి

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లభించవని ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డు, 10 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పిస్తే ప్రైవేటు ఉద్యోగులు సైతం ధీమా గా పని చేసుకుంటారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంరక్షణ చట్టం ఏర్పాటు చేసేలా తన గొంతు ఉంటుందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఉద్యోగస్తుల సమస్యలతో పాటు ప్రైవేటు ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఇప్పటివరకు ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం కోసం గత పది సంవత్సరాలుగా కృషి చేసిన విషయం రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులకు విధితమేనని అన్నారు.

కరోనా సమయంలో ప్రైవేటు ఉద్యోగస్తులకు 25 కిలోల బియ్యాన్ని, 2000 రూపాయల నగదును ప్రభుత్వం ద్వారా అందించిన విషయం ఆయన గుర్తు చేశారు. తాను పోటీ చేస్తున్నది ప్రైవేటు ఉద్యోగస్తుల సంక్షేమం కోసం ఉద్యోగస్తుల రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు తో పాటు అధ్యాపకులు తులసీదాస్ వాసుదేవరావు మురళి పున్నం చందర్ పాడి జైపాల్ రెడ్డి వెంకటరమణ డాక్టర్ వి స్వరూప రాణి, విజేందర్ రెడ్డి వనమాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.