calender_icon.png 2 October, 2024 | 5:53 AM

గోరక్షణ మన కర్తవ్యం

02-10-2024 03:20:37 AM

ప్రభుత్వాలు కూడా అందుకు కృషి చేయాలి

  1. గోమాతను రాజ్యమాతగా ప్రకటించడంపై షిండే ప్రభుత్వానికి అభినందనలు
  2. షిండే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు 
  3. శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి 

* నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. కేవలం నేను దేశ ప్రజల భావన, కోరికలను ప్రతినిధిగా వ్యవహరిస్తా. కానీ, ఆవుల రక్షణకు నిలిచిన పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరముంది. గోమాతకు గౌరవమిచ్చిన పార్టీ ఓడిపోతే వాళ్ల కృషి నిరర్ధకమవుతుంది.

 శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి 

ముంబై, అక్టోబర్ 1: గోమాతను మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్యమాతగా ప్రకటించడంపై జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ హర్షం వ్యక్తంచేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే చేశారని ప్రశంసించారు.

మహారాష్ట్రలోని అధిక సంఖ్యాక ప్రజలు కోరుకున్న విధంగా అందరితో చర్చించి షిండే ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. గోసంరక్షణ ప్రతి భారతీయుడి కర్తవ్యమని పేర్కొన్నారు. గోమాతను రాజ్యమాతగా ప్రకటించిన నేపథ్యంలో ముంబైలో సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి శంకరాచార్య స్వామీజీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోమాతపై మహారాష్ట్ర ప్రకటన గురించి తెలిసిన వెంటనే నాలుగు శంకరాచార్య పీఠాల అధిపతులం వచ్చామని తెలిపారు. తాము చేసిన ప్రతిపాదనలను అంగీకరించి షిండే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కువ మంది కోరుకునేది ఇదేనని, షిండేకు, ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ఆశీర్వాదం తెలుపుతున్నట్లు చెప్పారు.

మహా రాష్ట్ర నిర్ణయం నచ్చి యాత్రను మధ్యలో విడిచిపెట్టి ముంబై వచ్చినట్లు శంకరాచార్య స్వామీజీ చెప్పారు. “నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. కేవలం నేను దేశ ప్రజల భావ న, కోరికలను ప్రతినిధిగా వ్యవహరిస్తా. కానీ, ఆవుల రక్షణకు నిలిచిన పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరముంది.

గోమాతకు గౌరవ మిచ్చిన పార్టీ ఓడిపోతే వాళ్ల కృషి నిరర్ధకమవుతుంది” అని పేర్కొన్నారు. ఈ సందర్భం గా గోమాత రక్షణ కోసం గళమెత్తిన ఇద్దరు నేతల పేర్ల ప్రస్తావించారు. గుజరాత్ కాంగ్రె స్ ఎమ్మెల్యే గెనిబెన్ ఠాకూర్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే  పార్టీలకు అతీతంగా గోసంరక్షణకు పాటుపడ్డారని ప్రశంసించారు. 

గోసంరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలి

గోసంరక్షణకు చర్యలు తీసుకోవాలని, గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాశాం. గోమాతను రక్షించకుంటే మీకు గౌరవం ఎలా లభిస్తుంది? ఆవులు మనకు అన్ని ఇస్తాయి. అందుకే నేను గో ప్రేమికుడిగానే ఉంటా. గోసంరక్షణకు కృషి చేస్తా. ఓ యువకుడు నన్ను అడిగాడు. ఆవు మనకు జన్మనివ్వలేదు. మనకు ఆవులాగా నాలుగు కాళ్లు లేవు. పోలికలు వేరుగా ఉంటాయి.

అలాంటప్పుడు ఆవును మాతగా ఎలా కొలుస్తామని ప్రశ్నించాడు. అతని నేను ఇలా సమాధానం ఇచ్చా. కేవ లం పాలు ఇచ్చినంతమాత్రాన ఆవును మాతగా కొలువడం లేదు. సనాతన ధర్మం వృషభ (ఎద్దు) రూపంలో ఉంటుంది. ఈ సనాతన ధర్మాన్ని మనం అంగీకరించాం. ఆ వృషభానికి జన్మనిచ్చిన ఆవును మాతగా పూజిస్తామని చెప్పా. భారత ప్రభుత్వ రాజ్య చిహ్నంలో నాలుగు సింహాలు ఉంటాయి.

దాని పీఠంలో ఎద్దు, ఏనుగు, పులి, గుర్రం చిహ్నాలు కూడా ఉంటాయి. వీటిలో ఏనుగు, పులి, గుర్రాలను ఎవరూ చంపరు. కానీ ఎద్దులను మాత్రం చంపేస్తున్నారు. ఎందుకంటే అది హిందువులకు చెందినది కాబట్టి. రాజ్య చిహ్నంలో ఉన్నవాటికి ప్రభుత్వం రక్షణ కల్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్స వంలో సింగోల్ (రాజదండం)ను మళ్లీ తీసుకువచ్చారు.

ఆ సింగోల్‌పైన కూడా వృషభం ఠీవిగా కూర్చుని ఉంటుంది. మన ప్రభుత్వమూ ఆ విషయాన్ని అంగీకరిస్తుంది. అందుకే గోసంరక్షణ కోసం మేము ఇంతలా పాటు పడుతున్నాం. గోప్రతిష్ఠ యాత్ర చేస్తున్నాం. ఆవు సంరక్షణ హిందువుల హక్కు. ప్రతి భారతీయుడి కర్తవ్యం అని శంకరాచార్య స్వామీజీ స్పష్టం చేశారు.  

విశ్వగురుగా భారత్

గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లినప్పు డు జరిగిన ఘటనలపైనా స్వామీజీ మాట్లాడారు. అక్కడివాళ్లు ఆవు తమ ఆహారమని, మాపై ఇలాంటి నిబంధనలు రుద్దకూడదని నిరసన తెలిపారు. విదేశాల నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు కూడా కొన్ని డిమాండ్లు చేస్తారు. వాటిని మనం ఎలా అంగీకరిస్తాం. అందుకే దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గోహత్యను అంగీకరించడానికి వీల్లేదు.

అన్ని రాష్ట్రాల్లో గోధ్వజాన్ని స్థాపిస్తూ వస్తున్నాం. అక్టోబర్ 16న ముంబైలో నూ ప్రతిష్ఠ చేస్తాం. మేం ఎవరి మనోభావాలకు విరుద్ధంగా వెళ్లడం లేదు. ఏక్ నాథ్ షిండే కూడా అందుకే గోమాతను రాజ్యమాతగా ప్రకటించారు. ఎవరికి వ్యతిరేకంగా ఆయన ఈ పని చేయలేదు. కేవలం దేశంలోని ప్రజల కోరికను గౌరవించి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏదైనా పార్టీ, అందులోని వ్యక్తులు షిండే నిర్ణయాన్ని సవాల్ చేస్తే వాళ్ల అధికారాన్ని మీరు కూల్చాలి. ఈ దేశం ఎవ రిదో వాళ్ల భావన ప్రకారమే అధికారం చెలాయించాలి. భారత్ ఒకప్పుడు విశ్వానికి గురువుగా వ్యవహరించింది. మళ్లీ ఆ రోజులు వస్తాయి. కొంత ఆలస్యమై నా మళ్లీ విశ్వగురుగా భారత్ నిలుస్తుం ది అని స్వామీజీ వివరించారు. కాగా, గోమాతను రాజ్యమాతగా ప్రకటించిన షిండే ప్రభుత్వ నిర్ణయంపై మహారాష్ట్ర లో హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. 

9న హైదరాబాద్‌లో గోధ్వజ్ స్థాపన

శంకరాచార్య స్వామీజీ చేపట్టిన భార త్ గోధ్వజ్ యాత్ర సెప్టెంబర్ 22న అయోధ్య నుంచి ప్రారంభం కాగా ఈశాన్య రాష్ట్రాలకు చేరింది. ఆదివారం త్రిపుర రాజధాని అగర్తల నుంచి కోల్‌కతాకు చేరుకున్నారు. సోమవారం మహా రాష్ట్ర నిర్ణయంతో హుటాహుటిన ముం బైకి వచ్చారు. యాత్రలో భాగంగా కోల్‌కతా ఈ నెల 4న గోధ్వజాన్ని స్థాపించ నున్నారు. అనంతరం 5వ తేదీన జార్ఖం డ్, 6న ఒడిశా, 7న ఛత్తీస్‌గఢ్, 8న మధ్యప్రదేశ్, 9న తెలంగాణకు రానున్నారు.