26-03-2025 01:14:37 AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
జగిత్యాల అర్బన్, మార్చి 25 (విజయ క్రాంతి): జగిత్యాల నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడడం తనకు సంతృప్తినిచ్చిందని పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా ప్రతినిధిగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ప్రజా ఆస్తులు కూడా సంరక్షించడం తన బాధ్యత అని అన్నారు.
ఎస్‌ఆర్‌ఎస్పి నిర్మాణ దశలో ధరూరు రెవెన్యూ గ్రామం నుండి 200 ఎకరాలు సేకరించిన భూములు జగిత్యాలకు వరంగా మారాయని, ప్రజా జీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుండి జగిత్యాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజా ఆస్తులు రక్షించానని తెలిపారు. దరూర్లో ప్రభుత్వ భూములు పరిరక్షించడంతో జగిత్యాల కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం నిర్మించుకోవడం జరిగిందన్నారు.
దేవాదాయ శాఖ ఆస్తులు రక్షించడం కూడా ప్రధానంగా భావించి దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉద్యమించానన్నారు. నర్సింగపూర్లో 437, 251 సర్వే నెంబర్లలో వందలాది ఎకరాలను కొంతమంది అనర్హులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ధరణిని ఆసరాగా చేసుకుని ఆక్రమించుకున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాక్రాంతమైన భూమి వివరాలు తెలుపాలని జనవరి 18 న జిల్లా కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా లేఖ రాస్తే ఏడాది తర్వాత సర్వే నంబర్ 437 కు సంబంధించిన వివరాలు మాత్రమే అందజేశారన్నారు. ఇంకా 251 సర్వే లోని భూమి వివరాలు అందజేయాల్సి ఉందన్నారు.
భూ ఆక్రమణలపై తాను ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా స్పందించిన ప్రభుత్వం 437 లో 90 ఎకరాల భూమి అనర్హుల పేర్లు చేర్చినట్లు గుర్తించి, చర్యలు చేపట్టారన్నారు.అసైన్మెంట్ భూమి 13.21 ఎకరాలు నిబంధనలు ఉల్లంఘించి క్రయ విక్రయాలు జరిగిన భూమితో పాటు 76 ఎకరాల 19 గుంటల భూమి స్వాధీనం చేసుకున్నారన్నారు.
నర్సింగ్ పూర్ గ్రామంలోని భూములు నిరుపేదలు, బలహీన వర్గాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రజావసరాలకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అనర్హులు అని తెలిసి కూడా భూములు పట్టాలు చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అలాగే సర్వే నంబర్ 251 కు సంబంధించి కూడా అక్రమ పట్టాలు రద్దు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్ లో ఇటువంటి పొరపాట్లు జరుగకుండా అక్రమనదారులపై చర్యలు తీసుకోవడం తో పాటు అక్రమంగా పట్టాలు చేసిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.