calender_icon.png 7 April, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాదారుల కబంధ హస్తాల నుండి స్థలాన్ని రక్షించండి

07-04-2025 04:18:54 PM

ప్రజావాణిలో బాధితురాలు వేడుకోలు..

మందమర్రి (విజయక్రాంతి): గత రెండు సంవత్సరాలుగా తన సొంత భూమిని కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న కబ్జారాయుళ్ళ ఖబంద హస్తాల నుండి తన భూమిని కాపాడి తనకు తగిన న్యాయం చేయాలని బాధితురాలు ప్రజావాణిలో వేడుకున్న ఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమె మాటల్లోనే... పట్టణంలోని ప్రాణహిత కాలనీలో నివాసముండే మంద పద్మ గత మూడు సంవత్సరాల క్రితం మండలంలోని సారంగపెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 205లో మూడున్నర గంటల భూమిని ఆవుల రమేష్ అనే వ్యక్తి నుండి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంది. స్థలం చుట్టూ సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసుకున్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పిచ్చి మొక్కల తొలగింపు పనులను గ్రామ మాజీ సర్పంచ్ భర్త ఫిరోజ్ చేపట్టి పిచ్చి మొక్కలను తొలగించడంలో బాగంగా గ్రామంలోని రిడ్డును ఆనుకొని ఉన్న తన భూమిలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అంతే కాకుండా తన భూమిలోని సరిహద్దు రాళ్ళను చెరిపేశారు. ఇదే అదనుగా భావించిన భూమి అమ్మిన వ్యక్తి ఆవుల రమేష్ తన హద్దులను దాటి నా భూమిలోకి చొచ్చుకు వచ్చి నా భూమిలో తన హద్దు రాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు. దీనిపై సదరు మాజీ సర్పంచ్ భర్తను, ఆవుల రమేష్ ను అడిగితే వారి నుండి ఎలాంటి సమాధానం లేదు. దీనిపై గతంలో ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదు. తన భూమిలోనున్న పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండనా భూమిలోని పిచ్చి మొక్కలను తొలగించడమే కాకుండా హద్దురాల్లను తొలగించి నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.

గత మూడు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న ఆవుల రమేష్ మాజీ సర్పంచ్ భర్త ఫిరోజ్ పై కఠిన చర్యలు చేపట్టి నా స్థలంలో హద్దులను నిర్ధారించి తగిన న్యాయం చేయగలరు. అంతేకాకుండా ఆవుల రమేష్ నుండి ఆవుల బక్కయ్య అనే వ్యక్తి అదే సర్వే నెంబర్ లో భూమి కొనుగోలు చేయగా అతని సరిహద్దు దాటి నా భూమి హద్దులో  ఫెన్సింగ్ వేశాడని అతని పైన కూడా చర్యలు చేపట్టి తగిన న్యాయం చేయగలరని బాధితురాలు కోరింది. అనంతరం అధికారులకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా తహశీల్దార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ... బాధితురాలి వినతిపత్రంపై సమగ్ర విచారణ జరిపించి బాధితురాలికి తగిన న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ లు పాల్గొన్నారు.