16-12-2024 10:20:52 PM
హైడ్రా అధికారులను కోరిన సీపీఎం నాయకులు...
పటాన్ చెరు: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో రోడ్లు, పార్కులు, ప్రభుత్వ భూములు, చెరువు కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడాలని, ఇందుకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకులు నాయిని నరసింహారెడ్డి వివిధ కాలనీల అసోసియేషన్ నాయకులతో కలిసి హైడ్రా అధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం హైడ్రా అధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
గతంలో హైడ్రా కమిషనర్ ను కలిసి వందనపురి కాలనీలో రోడ్లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించగానే స్పందించిన హైడ్రాధికారులు రోడ్డుకు అడ్డంగా నిర్మించిన కట్టడాలను తొలగించారని తెలిపారు. కాగా అమీన్ పూర్ లో జరుగుతున్న అక్రమాలపై హైడ్రాధికారులకు తాము మరిన్ని వివరాలు అందజేశామన్నారు. పూర్తి వివరాలు తీసుకొని ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు వెల్లడించారని నరసింహారెడ్డి తెలిపారు. హైడ్రా అధికారులను కలిసిన వారిలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు లింగమయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.