సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కు విశ్రాంత రెవెన్యూ అధికారుల లేఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి) : ధరణి పోర్టల్‌ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను అక్రమంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ యూనియన్ ఆరోపించింది. దీంతో ప్రభుత్వానికి రూ. 50 వేల కోట్ల నుంచి రూ. 60 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను.. అక్రమార్కుల నుంచి తిరిగి రాబట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సంఘం ప్రతినిధులు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో జరిగిన అక్రమాలపై శనివారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ శ్రీవాత్సవకు లేఖ రాశారు. 2020 నవంబర్ నుంచి ఈ రెండు జిల్లాల్లో అనేక అవకతకలు జరిగాయని వారు ఆరోపించారు.
ఈ అక్రమాల విలువ రూ. 50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేట్‌పరం చేసిన అధికారులపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు కొన్ని భూముల వివరాలను లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సంఘం నాయకులు సురేష్ పొద్దార్, వి.బాలరాజు, ఎ.రవీందర్‌రెడ్డి, బి.మధుసూదన్, విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మయ్య, నారాయణ పత్రికా ప్రకటన విడుదల చేశారు.