calender_icon.png 2 November, 2024 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములను కాపాడండి

17-07-2024 03:21:35 AM

  • ఉన్నతాధికారులకు మంత్రి శ్రీధర్ బాబు లేఖ 

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు అధికారులకు ఆదేశించారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనా అధికారులు స్పందించకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చుట్టూ, ఇతర ప్రాంతాల్లో రూ. కోట్లు విలువైన భూములను కబ్జాదారులు ఆక్రమించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లకు లేఖ రాశారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ఫిర్యాదుతో అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఉదాసీనత ప్రదర్శించిన అధికా రులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఖానామెట్ రెవెన్యూ గ్రామ పరిధి లోని సర్వే నెంబర్ 41/14లోని 252.24 ఎకరాల భూమి ఉండగా, 2008లో అప్పటి ప్రభుత్వం 180.13 ఎకరాలను హుడాకు కేటాయించినట్లు తెలిపారు. అందులోనుంచి 75 ఎకరాలను పారిశ్రామిక మౌలికవసతుల అభివృద్ధి సంస్థకు హుడా బదిలీ చేసిందన్నారు.

హుడా ఆధీనంలోని 105.13 ఎకరా లు, టీజీఐఐసీ యాజమాన్యంలోని 75 ఎకరాల్లో అత్యధికభాగం కబ్జాదారుల ఆధీనం లోకి వెళ్లిందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. అదేవిధంగా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని 100, 101 సర్వే నెంబర్లలోని 100 ఎకరాల భూమిపై కబ్జా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజావసరాలకు ఉపయోగపడాల్సిన ప్రభు త్వ భూములను కాపాడేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందించి వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. నిర్దిష్ట కాలవ్యవధిలో సమీక్షలు నిర్వహించి క్షేత్రస్థాయి సిబ్బందికి బాధ్యతను నిర్దేశించాలని ఆదేశించారు. ఆక్రమణల సమాచారం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశించారు.