19-04-2025 11:37:06 PM
– సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య
– సీపీఎం ఆధ్వర్యంలో ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డి వినతి
అబ్దుల్లాపూర్మెట్: జీనియస్ కన్స్ట్రక్షన్ చేర నుంచి ఇందిరాసాగర్ చెరువు, వేములకత్వను రక్షించాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. అనాజ్పూర్ గ్రామ పరిధిలో ఉన్న ఇందిరాసాగర్, వేములకత్వ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల సరిహద్దులను రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ రోడ్డు నిర్మిస్తున్నారని.. ఆ నిర్మాణాలను అడ్డుకుని చెరువులను రక్షించాలని ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ... జీనియస్ కన్స్ట్రక్షన్ చేర నుంచి ఇందిరాసాగర్ చెరువును వేములకత్వాను రక్షించాలన్నారు.
ఇప్పటికే రామోజీ ఫిలింసిటీ యజమాన్యం వేముల కత్వ ఎఫ్టీఎల్లో అక్రమంగా భారీ గోడ నిర్మించారన్నారు. మరొ పక్క రియల్ ఎస్టేట్స్ వ్యాపారస్తులు వేముల కత్వ, ఇందిరా సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పైన కొండగలు, గుట్టలు ధ్వంసం చేసి.. ఆ బండ రాళ్లు, మట్టిని చెరువులో వేసి భారీగా రోడ్డు నిర్మించారని వివరించారు. సీపీఎం పోరాట ఫలితంగా చెరువులు నుంచి మట్టిని, బండరాళ్లను తొలగించినప్పటికీ... వెంటనే సర్వే చేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వేముల కత్వ, ఇందిరా సాగర్ సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఏరియాను పారదర్శకంగా సర్వే నిర్వహించి సరిహద్దులు ఏర్పాటు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం అబ్దుల్లాపూర్ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా, నాయకులు ముత్యాలు, జంగయ్య, రాములు, మహేష్, రవి, వెంకటేశ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.