21-04-2025 12:00:00 AM
పాల్వంచలో వందల కోట్ల విలువ చేసే సుమారు 400 వందల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రూ వందల కోట్ల విలువగల 400 ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అయ్యాయని, ప్రభుత్వ సర్వే నెంబర్లు అయినా 444,999,817,727 లలో సర్వే చేసి వాటిని పరిరక్షించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం పాల్వంచలో శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను అక్రమార్కులుయథేచ్ఛగా అమ్ముతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న ప్రభుత్వ భూములు అమ్ముతున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
గతం లో ప్రభుత్వ భూముల రక్షణకు వేసిన ఫెన్సింగ్ తొలగించిన బోర్డు లు పీకివేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.ప్రభుత్వ భూములకు మరో సర్వే నెంబర్ వేసి రిజిస్టేషన్ చేస్తున్నా రిజిస్ట్రేషన్ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారాని ఆరోపించారు.ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిన వాటికి మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు కేటాయిస్తూ సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు.
పాల్వంచలో ఉన్న ప్రభుత్వ భూములు మొత్తం సర్వే చేయించి కాపాడాల్సిన బాధ్యత స్థానిక శాసన సభ్యులు, ఉమ్మడి జిల్లా కు చెందిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఉందని,ప్రభుత్వ భూమి మొత్తం రికవరీ చేసి ఇల్లు లేని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించకుండా భవిష్యత్తులో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బట్టు అశోక్, రెడ్డి, బట్టు నరేష్, మాలత్ ప్రశాంత్, పవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.