డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం కలగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సంక్షేమ సిరులు కురువాలని కోరుకున్నారు. 2025లో అందరికీ సరికొత్త ఆనందాలను, అంతులేని ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలి : పొంగులేటి
రాష్ట్ర ప్రజలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఇంటింటా ఆనందాలు.. ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేద్దామన్నారు.
సురక్షిత ప్రయాణం చేయాలి: పొన్నం ప్రభాకర్
ప్రజాపాలన ప్రభుత్వం 2024 పూర్తిచేసుకొని 2025లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: కోమటిరెడ్డి
నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2024లో రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలు, కులగణన, రీజినల్ రింగ్ రోడ్డు, రైతు రుణమాఫీ, సన్నాలకు బోనస్ అమలుతోపాటు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత శ్రమించి రాష్ట్రాన్ని అబివృద్ధి బాట పట్టిస్తామన్నారు.
అందరికీ మంచే జరగాలి: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
ఈ కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, విజయాలు సాధించాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. 2024 కూడా తన జీవితంలో ముఖ్యమైన సంవత్సరమని అభిప్రాయపడ్డారు. ఒక రాజకీయ నాయకుడిగా చట్టసభలో అడుగుపెట్టడమే కాకుండా పీసీసీ అధ్యక్ష పదవి వరించిందిని, ఇది తన జీవితంలో అత్యంత గొప్ప విషయమని తెలిపారు.