calender_icon.png 3 March, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకా హత్య కేసును 6 నెలల్లో విచారించండి

02-03-2025 12:51:06 AM

హైకోర్టులో కూతురు సునీత పిటిషన్ 

ప్రత్యేక ధర్మాసనం ముందుంచాలని జడ్జి ఆదేశం 

హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): ఏపీకి చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను 6 నెలల్లో పూర్తి చేసేలా కింది కోర్టుకు ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కుమార్తె సునీతారెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ముందుంచాలంటూ సింగిల్ జడ్జి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.  వివేకా హత్య కేసు సీబీఐ కోర్టుకు బదిలీ అయి దాదాపు రెండేళ్లయినా విచారణ ప్రారంభంకాలేదని, అందువల్ల 6 నెలల్లో విచారణ పూర్తయ్యేలా ఆదేశాలివ్వాలని సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్ గౌతం వాదనలు వినిపిస్తూ కేసు విచారణ జరగకుండా నిందితులు ప్రయత్నిస్తున్నార న్నారు. ప్రస్తుతం ఇంకా కోర్టు నుంచి కాగితాలు తీసుకునే దశలోనే ఉన్నారన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇదే కారణం మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను ప్రత్యేక విచారణ చేపట్టేలా చూడాలని అశ్వనీ ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు.

ఈ కేసులను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ప్రజాప్రతినిధుల కేసుల పురోగతిని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో కూడా సిట్టింగ్ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఉన్నారని, అందువల్ల ఈ పిటిషన్‌ను కూడా ప్రత్యేక ధర్మాసనం ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.