చందానగర్ సర్కిల్ డీసీ మోహన్‌రెడ్డి..
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): ప్రజలకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించేలా పార్కులను సుందరీకరించే దిశగా చర్యలు చేపడతామని చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విలువైన పార్కు స్తలాల రక్షణతో పాటు విభిన్నమైన థీమ్ పార్కు తరహాలో అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని అపర్ణ కమ్యూనిటీలో జీహెచ్‌ఎంసీకి చెందిన ఎకరానికి పైగా పార్కు స్థలన్ని అభివృద్ధి చేయాలని అపర్ణ కమ్యూనిటీ ఫెడరేషన్ అధ్యక్షురాలు రాణిరెడ్డి నేతృత్వంలో సభ్యులు రెండు రోజుల క్రితం డీసీని కోరారు. ఈ మేరకు శుక్రవారం పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, సానిటేషన్ విభాగాలతో కలిసి పార్కును సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విలువైన పార్కు స్థలం ఆక్రమణకు గురికాకుండా ప్రహరీ పునర్నిర్మాణం చేయాలని, పార్కు లోపల చెత్త, అవసరపు చెట్ల తొలగింపు సహా పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఫెడరేషన్ భాగస్వామ్యంతో పార్కును మరింత సుందరీకరించి థీమ్ పార్కు తరహాలో అభివృద్ధికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలను తయారు చేసి పంపాలని సూచించారు. అపర్ణ పరిసరాలలో నివసించే వందలాది కుటుంబాలకు ఈ పార్కు ఎంతగానో దోహదపడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ కేవీఎస్ఎన్ రాజు, డీఈ దుర్గాప్రసాద్, డాక్టర్ రవి, టీపీఎస్ రాకేష్, యుబీడీ సమీర, ఫెడరేషన్ ప్రతినిధులు విక్రమ్, రమేష్, డాక్టర్ రాజారామ్, డాక్టర్ నారాయణరెడ్డి, పద్మ, రాగిణి తదితరులు పాల్గొన్నారు.