calender_icon.png 22 February, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16 కొత్త హైవేలకు ప్రతిపాదనలు!

16-02-2025 12:00:00 AM

  • రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్‌లుగా మార్చాలని కేంద్రానికి వినతి
  • కొత్త హైవేల మంజూరు కోసం ఎదురుచూపులు. 
  • మెరుగైన రవాణా సౌకర్యాలతో ప్రగతి పరుగులు
  • వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం

హైదరాబాద్, ఫిబ్రవరి 1౫ (విజయక్రాం తి): పలు రాష్ట్రరహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ కేంద్ర ఉపరితల రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్రం లో కీలకమైన రోడ్లను హైవేలుగా మారిస్తే రాష్ట్రాభివృద్ధికి మరింత ఊతం అందించేందుకు అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ అధికా రులు తెలిపారు.

ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల నుంచి కొత్తగా ప్రతిపాదిస్తున్న హైవేలకు కలుపుతూ ఈ ప్రతిపాదనలను పంపించారు. పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఈ హైవేలు ప్రతి పాదించారు. ఇక ఇరుగుపొరుగు రాష్ట్రాలతోనూ లింక్ ఏర్పాటు చేస్తూ హైవేలు నిర్మిం చేలా కసరత్తు చేశారు.

ఏటా కొత్త హైవేలను నిర్మిస్తూ వస్తున్న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణ లో ఈ హైవేల విస్తరణకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ఇప్పటికే అధికారులు పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రతిపాదిత 1,767 కి.మీ. హైవేలను త్వరగా మంజూరు చేస్తే తెలంగాణలో హైవేల వ్యాప్తి మరింతగా పెరగనుంది. ఫలితంగా రాకపోకలకు చక్కని రోడ్లు అందుబాటులోకి వస్తాయి. 

పొరుగు రాష్ట్రాలకు రహదారి..

మహబూబ్‌నగర్ సమీపంలోని భూత్‌పూర్ వద్ద ఎన్‌హెచ్ 44 నుంచి నాగర్ కర్నూలు, అచ్చంపేట, మద్దిమడుగు, గంగాలకుంట, శ్రీగిరిపాడు వరకు ప్రతిపాదించిన హైవే వల్ల నల్లమలలోని ప్రఖ్యాత మద్దిమడుగు పుణ్యక్షేత్రం చేరుకునేందుకు అవకాశం ఏర్పడటమే కాకుండా కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం వల్ల ఏపీలోని మాచర్లకు చేరుకునేందుకు అవకాశం లభిస్తుంది.

ఫలితంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుంది. పెద్దపల్లి నుంచి కాటారం వరకు ప్రతిపాదించిన హైవే వల్ల కాళేశ్వరం టెంపుల్ చేరుకునేందుకు చక్కని మార్గం అందుబాటులోకి వస్తుంది.

జగ్గయ్యపేట వైరా కొత్తగూడెం హైవే నిర్మాణం వల్ల ఏపీతో రాకపోకలకు మార్గం సుగమమవుతుంది.  వనపర్తి  గద్వాల మంత్రాల యం హైవే వల్ల రాఘవేంద్రస్వామి సన్నిధికి చేరుకునేందుకు, ఏపీలోని ఎమ్మిగనూరు, ఆదోనికి వెళ్లేందుకు వ్యాపారపరంగా, రైతులకు ఉపయోగంగా మారనుంది.