calender_icon.png 12 March, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నత్తనడకన ఆస్తి పన్నుల వసూలు?

12-03-2025 01:35:11 AM

పన్నుల వసూలపై నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బంది

అధికారుల పనితీరుపై  జిల్లా కలెక్టర్ సీరియస్ 

ఇద్దరు మున్సిపల్ అధికారులు సస్పెన్షన్ .. 

17 మంది అధికారులకు షోకాస్ నోటీసులు జారీ..

సంగారెడ్డి, మార్చి 11(విజయ క్రాంతి): మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్లు నత్తనడకన సాగడంతో జిల్లా కలెక్టర్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 31 లోగా వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కలెక్టర్ సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మున్సిపల్ సిబ్బందిని సస్పెన్షన్ చేయడంతో పాటు 17 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొందరు సిబ్బంది పన్నుల వసూళ్లపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో పని చేస్తున్న ఆర్వోలు, వార్డు  ఆఫీసర్లతో పాటు వీరిని పర్యవేక్షణ చేయలసిన  అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే పన్నులు  వసూలు కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు, సమీక్షలు , ప్రభుత్వ పనులు అప్పగించడంతోని వంద శాతం  పన్నులు  వసూలు చేయలేక పోతున్నామని కొందరు ఉద్యోగులు తెలుపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్, సదాశివపేట, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా కొన్ని  మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో 60 శాతం  దాటని పన్నుల వసూలు ..?

సంగారెడ్డి జిల్లాలో వంద శాతం  పన్నులు వసూలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో మార్చి 31 గడువు సమీపిస్తున్న వంద శాతం  పన్నులు  వసూలు చేయలేకపోయారు. ఇండ్లు, షాపులు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, అపార్ట్ మెంట్ లు, వివిధ రకాల వాణిజ్య భవనాలు తో పాటు ట్రేడ్ లైసెన్స్, యూజర్ చార్జీల ను సిబ్బంది వసూలు చేయవలసి ఉంటుంది. 2024-25 వార్షిక సంవత్సరానికి ప్రభుత్వ లక్ష్యం వంద శాతం పన్నులు వసూలు చేయవలసి ఉంటుంది. కొన్ని మున్సిపాలిటీల్లో 60 శాతం  పన్నులు  కూడా వసూలు చేయలేదని తెలిసింది. సంగారెడ్డి కలెక్టరేట్ లో  జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పలువురు మున్సిపల్ కమిషనర్ పై తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది. నిర్లక్ష్యంగా పనిచేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

మార్చి 31 లోగా వంద శాతం పన్నులు  వసూలు చేయలని,  లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించడంతో అధికారులు సిబ్బంది కాలనీలో వైపు పరుగులు  పెడుతున్నారు. మార్చి 31 లోగా మున్సిపల్ పరిధిలో ఉన్న సొంత ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్, హోటల్ దరపు గజాల ఆధారంగా పన్నులు చెల్లించవలసి ఉంటుంది. మున్సిపల్ అధికారులు ఉన్న కాలనీలో్ వంద శాతం  పన్నులు వసూలు చేసేందుకు  ప్రజలకు అవగాహన కల్పించాలి. మున్సిపల్ పరిధిలో అధికారులు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో ప్రజలు పన్నులు చెల్లించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి . ఏప్రిల్ ఒకటి నుంచి పెండింగ్ లో  ఉన్న బకాయిలకు 25 శాతం వడ్డీ జా మ చేస్తారని కొందరు అధికారులు తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు సైతం ఆదేశాలు జారీ చేశారని సమాచారం. 

మున్సిపల్ పరిధిలో పన్నుల వసూళ్లులో  అక్రమాలు..? 

సంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాల్  కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే  ఆరోపణలు వినిపిస్తున్నాయి . షాపింగ్ మాల్స్, అపార్ట్ మెంట్లు , హోటల్లు, మార్టలు మున్సిపల్ పరిధిలో పుట్టగొడుగుల వెలుస్తున్నాయి . కొందరు సిబ్బంది వ్యాపారులు ఇచ్చే మామూళ్లకు, గిఫ్ట్ లకు ఆశపడి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి లక్షల రూపాయలు బకాయిలు ఉన్న వారిని ముట్టుకోకుండా చిన్నచిన్న వ్యాపారులను ముక్క పిండి మరి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది . మున్సిపల్ ప్రత్యేక అధికారులు, కమిషనర్లు పర్యవేక్షణ చేయకపోవడంతోని పన్నులు వసూలు కావడం లేదనే  ఆరోపణలు ఉన్నాయి. 

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మున్సిపల్ అధికారులు సస్పెన్షన్.. 17 మందికి షోకాజ్ నోటీసులు జారీ... 

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని కలెక్టర్ క్రాంతి వల్లూరు సస్పెన్షన్ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన 17 మంది సిబ్బంది షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా మున్సిపల్ శాఖ అధికారులతో బిల్ కలెక్టర్ లతో ఆస్తి పన్నుల వసూల  పై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వంద శాతం  పన్నులు వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ సిబ్బంది , బిల్ కలెక్టర్ల పనితీరు లో మార్పు రాకపోవడంతో కలెక్టర్  జహీరాబాద్ మున్సిపాలిటీ  పని  చేస్తున్న  బిల్ కలెక్టర్ ఖుర్షీద్ అహ్మద్, సదాశివపేట మున్సిపల్ బిల్ కలెక్టర్ శ్రీకాంత్లను సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 17 మందికి షోకాజు నోటీసులు జరీ చేశారు. సదాశివపేట మున్సిపల్ మేనేజర్, బిల్ కలెక్టర్ అనిల్, జహీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంజీవ్, బిల్ కలెక్టర్ సాయి స్వరాజ్, సంగారెడ్డి మున్సిపల్ లో పని  చేస్తున్నా  ప్రశాంత్, బిల్ కలెక్టర్ సోహెల్, హరి, ఇక్బాల్, తెల్లాపుర్  మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ రామకృష్ణ తో పాటు పలువురికి  షోకాస్ నోటీసులు జారీ చేశారు. పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇంటి పనులు, నల్లా బిల్లులు వంద శాతం  వసూలు చేసేందుకు ప్రతిరోజు సమీక్షలు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.