calender_icon.png 27 April, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాపర్టీ అఫెండర్ అరెస్ట్

26-04-2025 12:37:00 AM

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్25:  వరుస దొంగతనాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రాపర్టీ అఫెండర్ను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిందితుడు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం అశోక్ నగర్ కి చెందిన  సూర రవి, వయస్సు 35 సంవత్సరాలు, వడ్డెర కులానికి చెందినవాడు. అతడు గతంలో కూడా అనేక దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు రవి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో తల్లితో కలిసి కరీంనగర్లో నివాసం ఉండేవాడు. చదువు మధ్యలోనే ఆపేసి, తన కులవృత్తి అయిన మట్టి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే, దురలవాట్లకు బానిస కావడంతో దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టాడు.

గతంలో కరీంనగర్ పట్టణంలో పలు దొంగతనాలు చేయగా, టూ టౌన్ పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్య అతడి ప్రవర్తనతో విసిగిపోయి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నెల 13వ తేదీన రాత్రి సప్తగిరి కాలనీలో ఒక ఇంటిలో చొరబడి నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించాడు. అనంతరం వాటిని విజయవాడలో అమ్మేసి జల్సాలు చేశాడు. డబ్బులు అయిపోవడంతో కరీంనగర్లోని తన బావ ఇంట్లో దాచిన బంగారాన్ని అమ్మేందుకు మళ్లీ కరీంనగర్ వచ్చాడు.

పద్మనగర్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రెండు బంగారు బిస్కెట్లు, కత్తిరించిన బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు సుమారు 105 గ్రాములు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారించగా నేరం అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై గతంలో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. అయితే నిందితుడిని పట్టుకోడానికి కృషి చేసిన ఎస్సై ఏ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ సురేంద్రపాల్ సింగ్ , పోలీస్ కానిస్టేబుళ్లు జి రవీందర్ సాయి దీప్ , అవినాష్ , మల్లయ్య , సాయికిరణ్ లను పోలీసు కమీషనర్ ప్రత్యేకంగా అభినందించారు.