calender_icon.png 1 April, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థాపించిన పరిశ్రమలు సక్రమంగా నిర్వహించండి

30-03-2025 05:23:14 PM

పలువరికి ఉపాధి కల్పించండి..

ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్..

భద్రాచలం (విజయక్రాంతి): ట్రై కార్ ద్వారా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని జీవనోపాధి పొందుతున్న గిరిజన మహిళలు స్థాపించిన పరిశ్రమలు సక్రమంగా నిర్వహిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ పదిమందికి మార్గదర్శకులుగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తేజవాత్ బెల్లయ్య నాయక్ అన్నారు. ఆదివారం భద్రాచలంలోని శ్రీ లక్ష్మీ గణపతి న్యూట్రిమిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఆయన సందర్శించారు.

అక్కడ తయారు చేస్తున్న న్యూట్రిమిక్స్ పదార్థాల వివరాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా సమయంలో మార్కెటింగ్ సరిగా లేక మూతపడిన సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ఆర్థికంగా వెసులుబాటు కల్పించి తిరిగి ప్రారంభించుకోవడానికి ఐటీడీఏ ద్వారా చేయూత అందించినందున మహిళలు తప్పనిసరిగా ఈ పరిశ్రమలను బాగా నడిపి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు.

న్యూట్రిమిక్స్ తయారీ కోసం కొనుగోలు చేసే ముడి సరుకులు గ్రామాలలో హోల్సేల్ ధరలకు కొనుగోలు చేసి కల్తీ లేకుండా పదార్థాలను తయారుచేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకుంటే ప్రతి పరిశ్రమ లాభాల బాటలో నడుస్తుందన్నారు. కొనుగోలు చేసిన ప్రతి ముడి సరుకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించుకోవాలన్నారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను సందర్శించి మ్యూజియం లోపల గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన ప్రతి కళాఖండాలను పరిశీలించి రాబోయే తరానికి గిరిజన కల్చర్ యొక్క ప్రతి అంశం తెలిసే విధంగా మ్యూజియంను ముస్తాబు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అంతరించిపోతున్న గిరిజన ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు నేటి యువతకు అర్థమయ్యేలా అవగాహన కల్పించి గిరిజన సంస్కృతిని దేశ దేశాలకు విస్తరించే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం దమ్మక్క జాయింట్ లియాబిలిటీ గ్రూప్ మహిళలకు వారి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి రూ 5 లక్షల చెక్కును మహిళలకు అందించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ట్రైకర్ మిషన్ మేనేజర్ లక్ష్మీప్రసాద్, ఎస్ఓ భాస్కర్, ఏవో సున్నం రాంబాబు, ఏటీడీవో అశోక్ కుమార్, డీఎస్ఓ ప్రభాకర్ రావు, మేనేజర్ ఆదినారాయణ, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.