calender_icon.png 24 November, 2024 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్తశుద్ధితోనే సక్రమ వృద్ధి

27-08-2024 03:00:32 AM

అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం లోపల, చుట్టుపక్కల ఉన్న వందల చెరువులు, కుంటలు మాయమయ్యాయి. ఇందులో చాలా వరకు కబ్జాకు గురైనవే. ఈ కబ్జాలపై ప్రస్తుతం హైడ్రా హడావిడి చేస్తున్నప్పటికీ ఇది ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. ఇలా నాలుగు చెరువుల్లోని కట్టడాలను కూల్చి ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోతే మళ్లీ అవే పునాదులపై అక్రమ కట్టడాలు నిలువునా లేస్తాయి. అలా కాకుండా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని చెరువులు, నీటి వనరులను పకడ్బందీగా సర్వే చేయాలి. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను నిర్ధారిస్తూ హద్దు రాళ్లను పాతాలి.

అవసరమనుకొన్న చోట చెరువుల చుట్టూ కంచెలు నిర్మించాలి. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మిస్తున్నందున దాని పరిధిలో ఉన్న ప్రతి నీటి వనరును సర్వే చేసి, దానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలి. అధికారుల అవినీతో, నేతల అక్రమాలో ఏదైతేనేం నిషేధిత ప్రాంతాల్లో కట్టడాలు వెలిశాయి. అందులో చాలావరకు పేదలు, మధ్యతరగతి వర్గాల వారే నివసిస్తున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ కూల్చటం దేశ సంపదను ధ్వంసం చేయటంతోపాటు, అక్కడి ప్రజలను ఆర్థికంగా ఏండ్లపాటు వెనక్కు  నెట్టడమే అవుతుంది.

అలాంటి సంక్లిష్ట పరిస్థితి ఉన్నచోట బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిని కాస్త తగ్గించే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అందు కు భారీగా చార్జీలు విధించాలి. అప్పుడే మళ్లీ అక్రమ కట్టడాలు కట్టాలంటే ఆలోచి స్తారు. అన్నింటికంటే ముఖ్యమైనది నీటి వనరుల రక్షణ, ఆక్రమణల నిరోధానికి కచ్చితమైన కామన్ రూల్స్‌ను రూపొందించి వెంటనే అమల్లోకి తేవాలి. వాటిని ప్రజా బాహుళ్యంలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆ తర్వాత కూడా ఆక్రమణలు జరిగితే రాజకీయాలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకోవాలి.

హైదరాబాద్‌కు చాలా ఏండ్లపాటు నీటి సరఫరా చేసిన ఉస్మాన్ సాగర్, హిమా యత్ సాగర్ జంట జలాశయాలకు రక్షణ కల్పించిన 111 జీవోను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోతూపోతూ ఎత్తేసి పోయింది. అయితే, అప్పటికే ఈ జీవో పరిధిలో చాలా అక్రమ కట్టడాలు వెలిశాయి. జీవో ఎత్తేసిన తర్వాత అవి మరింత విశృంఖలంగా పెరిగి పోయాయి. దీంతో నగరానికి ప్రధాన నీటి వనరులకు ప్రమాదం ఏర్పడింది. ఈ జీవో పరిధిలోని అక్రమ నిర్మాణాలను మొత్తం కూల్చటం సాధ్యమయ్యే పనికాదు. అందు వల్ల ఇకకైనా ఈ ప్రాంతాన్ని ఒక క్రమ పద్ధతిలోకి తేవటానికి ఏకీకృత నిబంధ నలు తీసుకురావాలి.

ఈ జీవో పరిధిలోని ఒక ప్లాటులో భవనం నిర్మించా లంటేమొత్తం ప్లాటులో బిల్డప్ ఏరియాను 10 శాతానికి పరిమితం చేయాలి. గ్రీనరీ కనీసం 30 శాతం కొనసాగించేలా నిబంధన పెట్టాలి. ప్రత్యేక మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు ఉండేలా నిబంధనలు పెట్టాలి. వర్షపు నీటి నిల్వ ఏర్పాట్లు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

నగరంలోని ఇతర ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు ఎలాగైతే జీహెచ్ ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు ఇస్తున్నదో ఈ జీవో పరిధిలో కూడా కచ్చితంగా అనుమతులు తీసుకొనేలా నిబంధనలు పెట్టాలి. నిబంధనలు మీరి భవనాలు నిర్మిస్తే వాటిని కూల్చనైనా కూల్చాలి. లేదంటే చదరపు అడుగుకు కనీసం రూ. 3 వేల జరిమానా విధించి పెనుభారం మోపాలి. అలా అయితేనే అక్రమ నిర్మాణాలు ఆగుతాయి. ఏటా ఈ నిర్మాణాలను సర్వే చేసి పూర్తిగా ఆడిట్ చేయాలి. ఇలాంటి కఠిన చర్యలు తీసుకొన్నప్పుడే హైదరాబాద్‌ను విపత్తుల నుంచి కాపాడుకోగలం. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి