calender_icon.png 27 February, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదిగో పులి... ఇదిగో తోక...

27-02-2025 11:32:38 AM

పక్షం రోజులుగా మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచారం...

కల్పితమా... నిజమేనా..!

నిర్ధారించడంలో అటవీ అధికారుల వైఫల్యం...

ప్రతి ఏటా వేసవికాలంలోనే ఈ పెద్దపులి వస్తున్నట్లు రిపీట్ ..

మంథని,(విజయక్రాంతి): అదిగో పెద్దపులి... ఇదిగో తోక... అన్నట్టుంది... ఇక్కడి పరిస్థితి. గత పక్షం రోజులుగా పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరగడమే తప్పితే ఇప్పటివరకు అటవీ శాఖ అధికారులు నిర్ధారించిన దాఖలాలే కనిపించడం లేదు. ఇది ఇప్పటి పరిస్థితి కాదు ప్రతి సంవత్సరం ఇదే తంతు ఆనవాయితీగా వస్తుంది. ఇదిలా ఉండగా పక్షం రోజుల కిందట  భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్దపులి సంచరించినట్లు అక్కడి గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది అడవిలోకి వెళ్లి గాలించగా పాదముద్రలు కనుక్కున్నట్లు తెలిపారు.

దాంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత  అదే పెద్దపులి మల్హర్ మండలం తాడిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో సంచరించిందని ప్రచారం జరిగింది. కాపురం గ్రామ శివారులో ఒక ఆవు అడవి జంతువు దాడిలో చనిపోయి ఉండడంను గమనించిన గ్రామస్తులు అది పెద్దపులి కావచ్చు అని భయభ్రాంతులకు గురయ్యారు. అయినప్పటికీ ఇక్కడ పెద్దపులి తిరుగుతుందా లేదా అనేది అటవీశాఖ సిబ్బంది ఇప్పటి వరకు నిర్ధారించలేదు. అంతలోనే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివారం - చెన్నూరు మండలం సోమనపల్లి దండకారణ్యంలో కి పెద్దపులి వచ్చినట్లు తెరమీదకు వచ్చింది. ఆ క్రమంలోనే వేలాల జాతర రావడంతో మళ్లీ వేలాల గుట్ట సమీపంలో పెద్దపులి సంచరిస్తుందని ప్రచారం జరిగింది.

తాజాగా మంథని అటవీ ప్రాంతాల్లో 

తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి గండి మైసమ్మ గుడి మూలమలుపు వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక 1-52 గంటల సమయంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా కనిపించినట్లు స్థానికులు ఒకరు చెప్పడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంతకీ పెద్దపులి నిజంగానే సంచరిస్తుందా...? ఇదంతా కల్పితమా అని నిర్ధారిథించాల్సిన అటవీశాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తున్నది..

ప్రతి సమ్మర్ లోనే ఇదే పెద్దపులి కథ.... రిపీట్..

ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం వేసవికాలం వస్తుండగానే... పెద్దపులి కథ కూడా రిపీట్ అవుతున్నది. గత ఐదారు సంవత్సరాల నుంచి పరిశీలిస్తే... ప్రతియటా  ఎండాకాలంలోనే ఈ పెద్దపులి సంచారం షికార్లు చేస్తుంది. కాళేశ్వరం, మహాదేవపూర్, కాటారం, మలహార్, మంథని, అటు మంచిర్యాల జిల్లా శివారం అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఈ పెద్దపులి కథ ఏటేటా రిపీట్ అవుతున్నది. ఆయా మండలాల వారీగా అటవీ శాఖ సిబ్బంది అడవుల్లో పులి పాదముద్రలు కనుగొన్నామని చెప్పడమే తప్పితే ఇప్పటివరకు పెద్దపులిని పట్టుకున్నది లేదు. ఇదంతా చూస్తుంటే అదిగో పులి... ఇదిగో తోక అన్నట్టు ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఒకవేళ పెద్దపులి గనుక సంచరిస్తే... అటవీ శాఖ అధికారులు అడవుల్లో బోన్ గాని, సీసీ కెమెరాలు గాని ఏర్పాటుచేసి పెద్దపులిని కనిపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు అలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఉంది... అడవిలో ఎక్కడో పెద్దపులి సంచరించిందని చెబుతున్న అటవీశాఖ సిబ్బంది  నేరుగా పెద్దపులి పాదముద్రల వద్దకే వెళ్లి ఫోటోలు తీసి చూపెడుతున్నారు తప్ప...! వాస్తవానికి పెద్దపులి అక్కడే తిరిగిందని ఇలా తెలిసింది అన్న ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. ఈ వేసవికాలం సీజన్ లో అడవుల నుంచి జరిగే అక్రమ రవాణా కు ఎవరు అడ్డు రాకుండా ఉండేందుకే ఈ పెద్దపులి కథ ఆడుతున్నారా..? అన్న సందేహాలు  నివృత్తి కావడం లేదు. పెద్దపులి పాదముద్రలను కనుగొంటున్న అటవీశాఖ సిబ్బందికి ఆ పెద్ద పులి జాడను కనుక్కోవడం పెద్ద సమస్య ఏమి కాదని అంటున్నారు. ఏది ఏమైనా  ఈ పెద్ద పులి కథ ఎప్పుడు క్లైమాక్స్ కు వస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.