calender_icon.png 14 October, 2024 | 4:45 AM

విద్యుత్ శాఖలో 262 మందికి ప్రమోషన్స్, బదిలీలు

14-10-2024 02:13:24 AM

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఏడేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ జెన్కోలోని అధికారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్, మెకానికల్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న అధికారులకు ప్రమోషన్స్ ఇచ్చి బదిలీ చేస్తూ విద్యుత్ కార్పొరేషన్ ఎండీ రొనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఈ పదోన్నతులు తాత్కాలికమని, త్వరలో సీనియార్టీ ఆధారంగా, నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ప్రమోషన్స్‌ను కల్పిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పటిదాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వివరించింది. ప్రస్తుతం విద్యుత్ శాఖ డిజిటలైజేషన్ చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న శ్రీ ప్రకాశ్‌ను కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు సీఈగా ప్రభుత్వం బదిలీ చేసింది.

అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్లుగా ఉన్న 34మందికి డివిజనల్ ఇంజినీర్లు(ఎలక్ట్రికల్)గా పదోన్నతి కల్పించింది. ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం, కంప్యూటర్స్ విభాగాల్లో పనిచేస్తున్న 170 మంది ఏఈలు, 33 మంది ఏఏఈలకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లుగా, ఎలక్ట్రికల్ విభాగంలో డివిజనల్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఏడుగురికి సూపరింటెండింగ్ ఇంజినీర్లుగా ఉద్యోగోన్నతి కల్పించింది.

అలాగే ఇద్దరు సూపరింటెండింగ్ ఇంజినీర్లను సీఈలుగా, మెకానికల్ విభాగంలో అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్లుగా ఉన్న 12 మందిని డివిజన్ ఇంజినీర్లుగా, మెకానికల్ విభాగంలో ముగ్గురు డివిజన్ ఇంజినీర్లకు సూపరింటెండింగ్ ఇంజినీర్లుగా ప్రభుత్వం ప్రమోషషన్స్ ఇచ్చింది.