l మహిళా ఓటర్లపై కాంగ్రెస్ అభ్యర్థుల ఆశలు
l ప్రజలను మభ్యపెట్టేందుకే అలవికాని హామీలన్న బీఆర్‌ఎస్
l వివిధ సాకులు చెప్పి వాయిదా వేస్తూనే ఉంటారని ఆరోపణ
l మోదీతోనే దేశానికి భద్రత, పేదలకు భరోసా అంటున్న కమలనాథులు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం మొత్తం ఆరు గ్యారెంటీల చుట్టే తిరుగుతోంది. మెజార్టీ ఎంపీ సీట్లు కైవసం చేసేందుకు కాంగ్రెస్ సహా బీజేపీ, బీఆర్‌ఎస్ ఆరు గ్యారెంటీల మంత్రం జపిస్తున్నాయి. అధికార హస్తం పార్టీ తమను ఎన్నికల్లో గ్యారెంటీలు గట్టేక్కిస్తాయని భావిస్తోంది. కానీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ మాత్రం వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, ప్రజలను మభ్యపెట్టేందుకు రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని విమర్శలు కురిపిస్తున్నారు.
అమలు కానీ హామీలు ఇచ్చిన అధికారం చేపట్టిన తరువాత నిధుల కొరత పేరుతో కాలయాపన చేసిందని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోడ్, తరువాత స్థానిక సంస్థల ఎన్నికల సాకు చూపి హామీలను పక్కదారి పట్టిస్తుందని ప్రజలకు వివరిస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలకు అన్నివిధాలు ఆదుకున్నామని గులాబీ నేతలు పేర్కొంటున్నారు.
మహిళా ఓటర్లపై కాంగ్రెస్ ఆశలు
అధికారం చేట్టిన రెండు రోజులకే మహాలక్ష్మిపథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు వివిధ ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన పథకం పేద, మధ్యతరగతి మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని నారీమణులు ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా వంట గ్యాస్‌కు రూ.500లకే అందిస్తామని, 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుకున్నవారికి జీరో బిల్లును జనవరిలో అమలు చేయడంతో ఆ వర్గాల ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు పలుకుతారని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఎన్నికల కోడ్ తరువాత అర్హులకు రేషన్‌కార్డుల పంపిణీ చేస్తామని ప్రచారంలో హామీలు ఇవ్వడంతో ప్రజలు ఈ సారి హస్తం పార్టీ ఆదరిస్తారని పార్లమెంటు పోరులో నిలిచే అభ్యర్థులు కూడా భావిస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌పై ప్రజలకు నమ్మకంలేదని తమ గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలను మభ్యపెట్టేందుకే: బీఆర్‌ఎస్ నేతలు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చిందని, అవి అమలు చేయడం సాధ్యంకాదని తెలిసీ పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా అమలు చేస్తామని ప్రచారంలో ఊదరగొడుతున్నారని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. అధికారం చేపట్టి 120 రోజుల గడిచినా ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా ఐదు గ్యారెంటీలు విస్మరించారని ఆరోపిస్తున్నారు. ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్లు పంపిణీ ఉత్త నాటకమని, మొదటి నెల ఖాతాలో జమ చేసి ఎన్నికల కోడ్‌తో మళ్లీ బిల్లులు వేస్తోందని ఆరోపిస్తున్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు రైతుబంధు, బీమా, ఉచిత రేషన్ పంపిణీ, అర్హులైన పేదలకు నెలవారీ పింఛన్లు అందజేశామని కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శలు కురిపిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత జూన్ చివరి వారంలో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వేసి మరో రెండు నెలల పాటు సాగదీసి దసరా తరువాత గ్యారెంటీల మాట ఎత్తకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారని బీఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థులు ప్రజలకు వివరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు గెలిస్తే పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీపై వ్యతిరేకత చూపినా ఈ ఎన్నికల్లో మద్దతు పలకాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ మోసానికి పాల్పడింది: కమలనాథులు
రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా ఆరు గ్యారెంటీలను ఏవిధంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అర్భాటంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయని, ఆటో కార్మికుల జీవితాలపై దెబ్బకొట్టిందని, మహిళలు కూడా బస్సుల ట్రిప్పులు తగ్గించి నామమాత్రంగా పథకం అమలు చేసి ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ఆరు గ్యారెంటీలను ప్రచారంలో ఆస్త్రంగా వాడుకుని ఎన్నికల ముగిసిన తరువాత నిధుల కొరత పేరుతో తప్పించుకునే కుట్రలు చేస్తారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సరిపడా బడ్జెట్ కేటాయించడంలేదని విమర్శలు చేసి పథకాలను పక్కదారి పట్టిస్తారని ఆరోపిస్తున్నారు. దేశానికి, రాష్ట్రానికి ఆదర్శమైన పాలన, ప్రజలకు రక్షణ ప్రధాని మోదీతోనే సాధ్యమని, పదేళ్ల బీజేపీ పాలనలో ఇప్పటివరకు మత ఘర్షణలు, తీవ్రవాదుల బెడద లేదని, కుంభకోణాలు మచ్చుకు కూడా లేవని పేర్కొంటున్నారు. రేపటి పార్లమెంటు పోరులో రాష్ట్ర ప్రజలంతా కమలం పార్టీకి మద్దతు పలికి డబుల్ డిజిట్ సీట్లు గెలిచేలా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.