- ఈవీ పాలసీతో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ
- ప్రైవేట్ భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఉండేలా నిబంధన
- ఆర్టీసీ ఉద్యోగుల సర్వీస్ కేసుల పరిష్కారానికి కమిటీ
- రవాణాశాఖ మంత్రి పొన్నం
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం మాదాపూర్ హైటెక్స్‌లో డెయిరీఫుడ్స్, గ్రీన్ ఎనర్జీ ఎక్స్‌పోను పొన్నం ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సోలార్ పవర్ పాలసీ 2015లో ఎంతో సంచలనం సృష్టించి దేశంలోనే నంబర్ వన్ రాష్ర్టంగా నిలిచిందని చెప్పారు. ప్రైవేటు భవనాలపై తప్పనిసరిగా సోలార్ ప్యానెల్స్ ఉండాలనే నిబంధన తెస్తామన్నారు. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రజలకు మరిన్నీ డెయిరీ ఉత్పత్తులు తీసుకొచ్చి కల్తీ లేని వస్తువులు మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు.
అనంతరం తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరకాల రాజేశ్ మాట్లాడుతూ.. ప్రధాన్‌మంత్రి సూర్య ఘర్, ముఫ్త్ బిజిలీ యోజన, ప్రధాన్‌మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ వంటి పథకాల కింద సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం అనేక రాయితీలను అందజేస్తుందని తెలిపారు. తెలంగాణలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
డిఐసీసీఐ నేత దాసరి అరుణ ప్రసంగిస్తూ.. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహక రాయితీలు, పన్ను మినహాయింపులు లభిస్తున్నప్పటికీ సంబంధిత వ్యవస్థలు, ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా అభివృద్ధి చెందాలని అన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ నాలుగు ఎక్స్‌పోలను 15 వేల మంది సందర్శించే అవకాశం ఉందని, 100 మంది ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఆర్టీసీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు
ఆర్టీసీ ఉద్యోగుల సర్వీస్ కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లేబర్ ఎంప్లాయిమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్‌గా, మెంబర్ కన్వీనర్‌గా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ప్రజా వాణి నోడల్ ఆఫీసర్ దివ్య సభ్యులుగా పనిచేస్తారని చెప్పారు. విధుల్లో ఉన్న సమ యంలో గతంలో సర్వీస్ రిమూవల్ కేసులు ఉద్యోగులపై నమోదైన వాటిపై ఈ కమిటీ పరిశీలించనుందని తెలిపారు.
ఇప్పటికే ప్రజావాణిలో ఆర్టీసీకి సంబంధించిన సర్వీస్ రిమూవల్‌తోపాటు ఇతర కేసుల విషయమై ఫిర్యాదుల మేరకు బాధితులను పిలిచి ఈ త్రిసభ్య కమిటీ మాట్లడనున్నట్టు వెల్లడించారు. కేసుల్లో ఉన్న మెరిట్స్‌ను బట్టి ఆర్టీసీ యాజమాన్యానికి త్రిసభ్య కమిటీ రికమెండ్ చేయనుంది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గురువారం జీవో జారీ చేశారు.