calender_icon.png 5 November, 2024 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10వేల రోజులైనా హామీలు నెరవేర్చరు

03-11-2024 02:05:33 AM

  1. మేం ఇండ్లను నిర్మిస్తుంటే ఈ ప్రభుత్వం కూల్చుతుంది
  2. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు 100 రోజులు కాదు 10 వేల రోజులు కూడా సరిపోవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు సీఎం రేవంత్ సమాధానంగా చేసిన ట్వీట్ నేపథ్యంలో తెలంగాణ సీఎంను ఉద్దేశించి బండి ట్వీట్ చేశారు.

అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారెంటీలకు షరతులు వర్తిస్తాయని ప్రజలకు తెలియదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలు రాష్ట్రాన్ని, ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ కొత్తగా పుట్టిన బిడ్డపై రూ.లక్ష అప్పు భారం మోపినట్టే కాంగ్రెస్ సర్కారు కూడా ప్రతి వ్యక్తిపై రూ.2.5 లక్షల రుణభారం మోపుతోందని ఆరోపించారు.

రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని, రైతు భరోసా, రూ.500 వడ్ల బోనస్ బోగస్ అయ్యాయని విమర్శించారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌లో అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోయారని అన్నారు. మూసీ సుందరీకరణ కోసం సర్కారు వద్ద రూ.1.5 లక్షల కోట్లున్నాయని, కానీ ఆరు గ్యారెంటీల అమలుకు  మాత్రం నిధులు లేవా? అని ప్రశ్నించారు. 

మరో ఏటీఎంగా మూసీ..

కాళేశ్వరం తరహాలో మరో ఏటీఎంగా మూసీ రూపుదిద్దుకోనుందని బండి అన్నా రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా తాము ఇళ్లు నిర్మిస్తుంటే కాంగ్రెస్ సర్కారు పేదల ఇళ్లను కూలుస్తోందని విమర్శించారు. హాస్టళ్లలో నాసిరకం ఆహారంపై విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం విద్యార్థులు నిరసనలు ప్రారంభించారన్నారు.

నిరుద్యోగులపై ఈ ప్రభుత్వం లాఠీఛార్జీ చేయిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదల చేసిన ఉద్యోగ క్యాలెం డర్ పెద్ద జోక్ అని దుయ్యబట్టారు. తెలంగాణ పునర్నిర్మాణం ఏమో కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా విధ్వంసం చేసి అంధకారంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. హామీలను అమలు చేశారని భావిస్తే పాదయాత్ర చేసి నిజాలు తెలుసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.