calender_icon.png 19 October, 2024 | 6:11 PM

పాటల ‘రేవు’లో ప్రముఖ రచయితలు

25-07-2024 12:05:00 AM

తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ గేయ రచయితలైన సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సమక్షంలో ‘రేవు’ సినిమా పాటలు విడుదలయ్యా యి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర బృందమంతా హాజరయ్యారు. పాత పద్ధతిని గుర్తు చేస్తూ ఆడియో క్యాసెట్లను విడుదల చేసి అతిథులకు బహూకరించారు ‘రేవు’ టీమ్. ఈ సినిమాకి జాన్ కె జోసెఫ్ స్వరకర్త కాగా, ఇమ్రాన్ శాస్త్రి పాటలు రాశారు. వైశాఖ్ నేపథ్య సంగీత మందించారు.

ఈ కార్యక్రమంలో చంద్రబోస్ మాట్లాడుతూ “రేవు పాటలు రాసిన ఇమ్రాన్ శాస్త్రి పేరు ఎంత వైవిధ్యంగా ఉందో అతను రాసిన పాటలు అంతే వైవిధ్యంగా ఉన్నాయి. నవ్యత, నాణ్యత కలగలసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు. “మనం వైవిధ్యమైన సినిమాల కోసం పర భాషల వైపు చూస్తుంటాం. అయితే ‘రేవు’ సినిమా పాటలు విన్నాక కొత్తతరం ప్రతిభావంతులపై నమ్మకం ఏర్పడుతోంది. రేపటి తెలుగు సినిమా బాగుంటుందని అనిపిస్తోంది. తెలుగు సంగీత దర్శకులకు అవకాశాలు రావాలి అప్పుడే మనవారి ప్రతిభ తెలుస్తుంది” అని అభిప్రాయపడ్డారు రామజోగయ్య శాస్త్రి.

అనంతరం సుద్దాల అశోక్ తేజ -కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ “కొత్త నెత్తుటి సముద్రం చూస్తున్నట్లు ఉంది. వేదిక మీద అక్షరాలన్నీ కలిపినట్లు ఉంది. ఈ ఆడియో ఫంక్షన్‌కు గీత రచయితలను అతిథులుగా పిలవడం గొప్ప సంప్రదాయం” అని తెలిపారు. చిత్ర గీత రచయిత ఇమ్రాన్ శాస్త్రి “ఈ వేదిక మీద ఆస్కార్ నుంచి అన్ని ప్రతిష్టాత్మక అవార్డులు ఉన్నట్లు భావిస్తున్నా” అన్నారు.  మత్స్య కారుల జీవన పోరాటం నేపథ్యంలో వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రధారులుగా హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ‘రేవు’ సినిమా ఆగస్టు రెండో వారంలో తెరమీదికి రానుంది. డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి నిర్మాణ సూపర్ విజన్ : జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పర్వతనేని రాంబాబు.