12-02-2025 12:50:12 AM
ఆర్థిక ఇబ్బందులే కారణమా?
మెదక్, ఫిబ్రవరి 11(విజయక్రాంతి): మెదక్ కు చెందిన ప్రముఖ కిరాణా వ్యాపారి సాయి దీప్ రమేష్(54) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మెదక్ పట్టణంలో జరిగింది. మెదక్ పట్టణంలో చిన్న కిరాణా షాప్ ప్రారంభించి అనతికాలంలో సూపర్ మార్కెట్ ఓనర్ గా ఎదిగిన రమేష్ కిరాణా వ్యాపారంలో దిగ్గజంగా నిలిచారు.
మెదక్ ప్రాంతంలో ఏ చిన్న కార్యం జరిగినా నిత్యావసర సామగ్రి కొనుగోలు చేయాలని సాయిదీప్ సూపర్ మార్కెట్ కు వెళ్తారు. తన దుకాణం కు వచ్చే కస్టమర్లతో అభిమానంగా అనుకూలంగా వ్యవహరించే రమేష్ అన్నది కాలంలోనే మంచి గుర్తింపును పొందారు. మంచితనం రమేష్ ను వ్యాపారంలో అగ్రగామిగా నిలిపింది.
అప్పులే కారణమా..?
చిన్న స్థాయి నుండి ఎదిగిన రమేష్ వ్యాపార రంగంలో పట్టణంలో అగ్రగామిగా నిలిచారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు చేసిన అప్పులు అధికం కావడంతోనే ఆర్థిక సమస్యలు ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. వ్యాపారం బాగానే నడుస్తున్నప్పటికీ అప్పులు తీర్చలేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రచారం సాగుతుంది. మృతికి సంబంధించిన వివరాలు కుటుంబీకులు వెల్లడించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పట్టణ పోలీసులు తెలిపారు.
ప్రముఖుల సంతాపం...
ప్రముఖ వ్యాపారి సాయి దీప రమేష్ మృతి వార్త తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప మనసున్న మనిషిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. అలాగే మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి రమేష్ మృతదేహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సైతం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పట్టణంలోని వివిధ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు రమేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.