11-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): ప్రాధాన్య క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
డిండి ఎత్తిపోతల పథకం పరిధిలో చివరిదశకు చేరుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని మంత్రులు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జరిగిన సాగునీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ ముందస్తు బడ్జెట్ సమావేశంలో ఇరువురు మంత్రులు అధికారులతో కీలక అంశాలపై చర్చించారు.
గత పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వం కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి సారించి, రాష్ర్టంలోని పాత ప్రాజెక్టుల నిర్వహణ అంశాన్ని గాలికొదలడంతో అవి ప్రమాదంలో పడే పరిస్థితి ఎదు రైందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న భూసేకరణ, పాత ప్రాజెక్టుల నిర్వహ ణ, నిధుల సేకరణపై దృష్టి సారించాలన్నారు.
ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్ట్‌ను ప్రా ధాన్యత అంశంగా తీసుకోవాలని, ఏఎంఆర్‌పీలో ఐదో పంపు ఏర్పాటు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును పూర్తిగా అధ్యయనం చేసి, గోదావరి నీటితో పాలేరు రిజర్వాయర్‌ను పరిపుష్ఠం చేసే పనులను వేగవంతం చేయాలన్నారు.
గోదావరి పరిధిలో బస్వాపూర్ మొదలు సిం గూరు వరకు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏదుల నుంచి వట్టెం ఏదుల కాలువలు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల ఆధునీ కరణ, కాలువలకు లైనింగ్ ద్వారా ప్రాజెక్టుల జీవితకాలం పెరుగుతుందని, అందుబాటు లో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకొనే అవకాశం ఉంటుందన్నారు.
పాత ప్రాజెక్టులను కాపాడుకునేందుకు మెయింటెనెన్స్ పనులు చేసుకుంటూనే, కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు రాబట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని మధ్య తరహా, చిన్న తరహా ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. పదేళ్లు పరిపాలించిన వారు 10 శాతం వడ్డీ రేటుకు అప్పులు తేగా.. తమ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత ఆ వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించేందుకు అధికారులు ప్రయత్నించారన్నారు.
సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యదాస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఈఎన్‌సీ జనరల్ అనిల్, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి, ఓఅండ్‌ఎం ఈఎన్‌సీ విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.