calender_icon.png 21 September, 2024 | 3:17 AM

ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి

21-09-2024 12:50:09 AM

  1. 2027 నాటికి ఎస్‌ఎల్‌బీసీ పూర్తి
  2. సొరంగం పనులకు నెలకు 14 కోట్లు 
  3. తక్షణం 42 కోట్లు విడుదలకు నిర్ణయం
  4. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి ఎస్‌ఎల్‌బీసీ పరిశీలన 

నల్లగొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నల్లగొండ నాగర్‌కర్నూల్ జిల్లాల సరిహద్దు మన్నేవారిపల్లి శివారులో ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎస్సెల్బీసీ సొరంగం పనులు పూర్తి చేసేందుకు నెలకు రూ. 14 కోట్ల ఖర్చవుతుందని నీటిపారుదల అంచనా వేసిందని, నిధుల విడుదలకు సర్కారు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 2027 నాటికి పనులు పూర్తి చేసి నల్లగొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు. సొరంగం పూర్తయితే నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. 

రీడిజైన్ల పేరుతో దోపిడీ..

 గత పాలకులు పదేండ్లలో ఎస్సెల్బీసీ సొరంగాన్ని పట్టించుకోకపోవడంతో వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన పనులు ప్రస్తుతం రూ.4 వేల కోట్లకు పెరిగి ఖజానాపై  పెనుభారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను గత ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలంగా మారేదన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను గాలికొదిలేసి రీడిజైన్ల పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. 

రూ. 4,400 కోట్లు మంజూరు చేయాలె: మంత్రి ఉత్తమ్

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సెల్బీసీ సొరంగం పనుల అంచనాలు సవరించి రూ. 4,400 కోట్లు మంజూరు చేయాలని క్యాబినెట్‌ను కోరతామన్నారు. డిండి ప్రాజెక్టు పనులపై వారానికోసారి సమీక్ష నిర్వహించాలని నీటి పారుదల కార్యదర్శిని ఆదేశించారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వలను పూర్తి చేస్తే ఏడాది పొడవునా సాగు నీరందించే అవకాశం ఉందని, వెంటనే నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను అభ్యర్థించారు.

రూ. 37 కోట్లు విడుదల చేయండి: మంత్రి కోమటిరెడి

 ఆర్ అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సెల్బీసీ హైలెవల్ కాల్వకు చెందిన 4వ మోటార్ మరమ్మతులు మూడు రోజుల్లో పూర్తి చేసి వెంటనే నీటి విడుదల ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుల భూసేకరణకు రూ. 37 కోట్లు విడుదల చేస్తే రెండు నెలల్లో చెరువులన్నింటినీ నింపుతామన్నారు. చెరువులు నిండితే కట్టంగూరు, నార్కెట్‌పల్లి మండలాల్లోని 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. నల్లగొండ జిల్లాకు తాగు, సాగునీటికి ఏఎమ్మార్పీ శాశ్వత పరిష్కారం కాదని భావించే తాను 2004లో ఎస్సెల్బీసీని మేనిఫెస్టోలో చేర్చాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను పట్టుబట్టానని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేల్, వంశీకృష్ణ, బాలూనాయక్, జైవీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అచ్చంపేట ఎత్తిపోతలను చేపడ్తం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకం, ఉదయసముద్రం, బ్రాహ్మణ వెల్లంల, పిల్లాయి పల్లి, బునాదిగాని కాల్వలను పూర్తి చేస్తామని భట్టి చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని పచ్చగా మార్చేందుకు అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి అన్నివిధాలా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు పూర్తి చేయాలని, అటవీశాఖ అనుమతులు సాధించాలని ఆధికారులను ఆదేశించారు.