02-03-2025 03:10:34 PM
అనుమతి లేని డ్రోన్, డిజె సౌండ్స్ పై చర్యలు
రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాసులు
మంచిర్యాల,(విజయక్రాంతి): సాధారణ ప్రజలు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమలులో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞలు నిర్ణయం తీసుకున్నామని, ఈ నిషేధాజ్ఞలు మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయన్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డీజే, డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడగింపు...
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో డీజే సౌండ్ ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడగించామని సిపి శ్రీనివాసులు తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించామన్నారు. వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపిల అనుమతి పొందాలని సూచించారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు, ఏ స్థాయిలో మైక్ సెట్ లు వినియోగించాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు
సిటీ పోలీస్ యాక్ట్ అమలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ ఒకటో తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపి తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని, పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.