హైదరాబాద్: నగరంలోని అఫ్జల్ గంజ్(AfzalGanj) లో కలకలం రేపిన కాల్పుల ఘటన కేసులో తెలంగాణ పోలీసులు(Telangana Police) పురోగతి సాధించారు. కాల్పుల జరిపిన నిందితుల్లో సీసీ ఫుటేజ్ ద్వారా ఒకరిని గుర్తించామని పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. కాల్పులు జరిపిన నిందితుడు బిహార్(Bihar) కు చెందిన మనీష్ గా గుర్తించామని, నిందితుడు మనీష్ మరికొందరితో ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవలే ఛత్తీస్ గఢ్ లోని ఓ బ్యాంకులో మనీష్ బృందం రూ. 70 లక్షలు చోరీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన స్థానికంగా భయాందోళనలను రేకెత్తించింది. కాగా, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ పోలీసులు మనీష్ ముఠా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బీహర్ ప్రభుత్వం నిందితుడు మనీష్ పై ఇప్పటికే రివార్డు ప్రకటించింది. ఇప్పటికే నగరంలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిందితుల కదలికలను పర్యవేక్షించేందుకు మూడు కమిషనరేట్ల పరిధిలో చెక్‌పోస్టు(Check Post)లను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, లాడ్జీల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేరస్తులను ఎట్టిపరిస్ధితిలో అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెడతామని పోలీసలు స్పష్టం చేశారు.