హైదరాబాద్: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తిరమలగిరి నుంచి దుండుగులు ఆటోలో షామీర్ పేట వరకు వెళ్లారు. షామీర్ పేట నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్లారు. గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ, కాల్పులకు పాల్పడిన వారిని అమిత్, మనీష్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఘటనపై బీదర్, హైదరాబాద్ పోలీసుల సంయుక్తంతో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్, బీదర్ పోలీసులు ఇప్పటికే బిహార్, ఝార్ఖండ్ చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అఫ్జల్‌గంజ్‌లోని ఓ ట్రావెల్ ఏజెన్సీ మేనేజర్‌పై గురువారం కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రోషన్ ట్రావెల్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న బాధితుడు జహంగీర్ తమ లగేజీ బ్యాగ్‌లో నగదు దొరకడంతో వారిని బస్సులో నుంచి కిందకు దించమని కోరినప్పుడు ఒక వ్యక్తి కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్చాడు. ఇద్దరు వ్యక్తులు బీదర్‌లో చోరీకి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ గార్డుతో సహా ఇద్దరిని కాల్చి చంపి రూ. 93 లక్షలు దోచుకున్నారు. బీదర్ నుండి తప్పించుకున్న తర్వాత, ఇద్దరూ నగరానికి చేరుకుని చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్ ఏజెన్సీలో టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.