- కార్పొరేట్ కంపెనీల్లో వింత పోకడ
- వినియోగం తగ్గడం వల్లనే మందగించిన ఆర్థిక వృద్ధి
- తాజా నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో గత నాలుగేళ్లలో కార్పొరేట్ సంస్థల లాభాలు నాలుగు రెట్లు పెరిగాయి కానీ ఉద్యోగుల జీతాలు మాత్రం ఆ స్థాయిలో పెరగలేదని తాజా నివేదిక ఒక టి వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల ఆర్థికాభివృద్ధి(జీడీపీ ) 5.4 శాతానికి తగ్గినప్పటికీ కార్పొరేట్ సంస్థల లాభాలు మాత్రం పెరగడం గమనార్హం. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తి ప్రైవేటు వినియోగమే.
దేశ జీడీపీలో 60 శాతం వాటా దీనిదే.జనం చేతిలో డబ్బులుంటే వినియోగం పెరుగుతుంది. అయితే ద్రవ్యోల్బణం రేటుకన్నా మించి జీతాలు పెరగకపోతే జీడీపీ తగ్గిపోతుంది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో 6.7 శాతం ఉన్న జీడీపీ జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి 5.4 శాతానికి తగ్గిపోయింది. ఇది గత ఏడు త్రైమాసికాల్లోనే కనిష్టం కావడం గమనర్హం. దేశంలోని కార్పొరేట్ సంస్థల లాభాలు పెరిగినప్పటికీ వేతనాలు ఎలా తగ్గుతూ వచ్చాయో తాజాగా ఓ జాతీయ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వివరించింది.
పారిశ్రామిక సమాఖ్య ఫిక్కీ, క్వెస్ కార్పొరేషన్ కలిపి ప్రభుత్వం కోసం రూపొందించిన నివేదిక 2019నుంచి 2023 మధ్య కాలంలో వేతనాల సగటు వృద్ధి 0.8 శాతంనుంచి 5.4 శాతం మధ్య మాత్రమే ఉందని పేర్కొన్నట్లు ఆ కథనం పేర్కొంది.ఈ సంస్థలు అధ్యయనం చేసిన ఆరు రంగాల్లో అత్యధికంగా ఎఫ్‌ఎంసీజీ రంగంలో మాత్రమే వేతనాలు 5.4 శాతం మేర పెరిగాయి. గత అయిదేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం సగటున ఏటా 5.7 శాతం మేర పెరుగుతున్న నేపథ్యంలో చూస్తే ఇది దానికన్నా తక్కువే కావడం గమనార్హం.
దీన్నిబట్టి ప్రైవేటు రంగంలో వేతనాలు నెగెటివ్ వృద్ధిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీని ప్రభావం వినియోగశక్తిపైనా పడతుంది. ఫలితంగా దేశ ఆర్థికాభివృద్ధి సైతం దెబ్బతింటుందని ఆ నివేదిక అభిప్రాయపడింది. ప్రైవేటు రంగ కంపెనీలు ఆర్జించిన లాభాలు గత 15 ఏళ్లలోనే అత్యధికమని, కేంద్ర ఆర్థిక వ్యవహారాల ముఖ్య సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఈ నెల ప్రారంభంలో పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో లాభాలు వచ్చినప్పటికీ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయిన ప్రైవేటు కంపెనీలు సిబ్బందిపై చేసే ఖర్చు ఎలా తగ్గుతూ వస్తోందో కూడా నాగేశ్వరన్ సవివరంగా తెలియజేశారు. కాగా డిసెంబర్ త్రైమాసికంలో కొన్ని రంగాల వృద్ధి పుంజుకున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 7 శాతం మధ్య ఉండవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వినియోగం మందగించడానికి వేతనాలు తక్కువగా ఉండడం ఒక ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్న విషయాన్ని ఆ కథనం గుర్తు చేసింది.
సర్వే చేసిన ఆరు రంగాల్లో ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్, ప్రాసెస్, ఇన్‌ఫ్రా (ఈఎంపీఐ) రంగం లో వేతనాల వృద్ధి అతి తక్కువగా 0.8 శాతం ఉండగా, ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఇది 5.4 శాతంగా ఉందని ఆ ఫిక్కీక్వెన్ నివేదిక పేర్కొంది. మిగతా నాలుగు రంగాలయిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, బీమా(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో 2.8 శాతం, రిటైల్ రంగంలో 3.7 శాతం, ఐటీ రంగంలో 4 శాతం, లాజిస్టిక్స్ రంగంలో 4.2 శాతం చొప్పున మాత్ర మే వేతనాలు పెరిగాయి.
గత అయిదేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం సగటు వృద్ధి రేటు 5.7 శాతం ఉండగా వేతనాలు ఆ స్థాయిలో కూడా పెరగకపోవడం గమనార్హం. దీర్ఘకాలిక వృద్ధితో పాటు వినియోగ శక్తి పెరగాలంటే ఉద్యోగుల వేతనాలు పెరగడం ముఖ్యమని లేని పక్షంలో, ఇరు పక్షాలు నష్టపోతాయని నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలను ఆ వార్తా కథనాలు గుర్తు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు తమ లాభాల్లో కొంత భాగాన్ని ఉద్యోగుల వేతనాల కోసం ఖర్చు చేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.