calender_icon.png 15 January, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలుత లాభాలు.. ముగింపులో నష్టాలు

07-08-2024 12:51:37 AM

  1. 1100 పాయింట్లు లాభాల్ని వదులుకున్న సెన్సెక్స్
  2. 24,000 దిగువన ముగిసిన నిఫ్టీ

ముంబై, ఆగస్టు 6: ప్రతికూల గ్లోబల్ సంకేతాలతో క్రితం రోజు భారీ పతనాన్ని చవిచూసిన స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్న సెషన్ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలతో ముగిసాయి. ట్రేడింగ్ తొలిదశలో గ్యాప్‌అప్‌తో మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్ భారీ గ్యాప్‌డౌన్‌తో ట్రేడింగ్ ఆరంభమయ్యింది. ఒక దశలో 1,093 పాయింట్ల లాభంతో 79,852 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరింది. అటుతర్వాత క్రమేపీ లాభాల్ని కోల్పోయి నష్టాల్లోకి మళ్లింది.  చివరకు 166 పాయింట్ల నష్టంతో 78,593 పాయింట్ల వద్ద నిలిచింది.

ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ట్రేడింగ్ తొలిదశలో 24,382 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరిన అనంతరం 24,000 పాయింట్ల స్థాయిని కోల్పోయింది. చివరకు 66 పాయింట్ల నష్టంతో 23,993 పాయింట్ల వద్ద నిలిచింది. స్టాక్ సూచీలు క్షీణించడం వరుసగా ఇది మూడవ రోజు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందన్న భయాలతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్న కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు వరుస మూడు రోజుల్లో 4 శాతం నష్టపోయాయి. ఆసియా సూచీలు మాత్రం రికవరీ అయ్యాయి. జపాన్ నికాయ్ సూచి 10.7 శాతం లాభపడగా, సియోల్, షాంఘై ఇండెక్స్ 3 శాతం వరకూ పెరిగాయి. హాంకాంగ్ మాత్రం నష్టపోయింది.

బ్యాంకింగ్ షేర్లకు అమ్మకాల సెగ

గురువారం రిజర్వ్‌బ్యాంక్ పాలసీ వెల్లడికానున్న నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 17 తగ్గగా, 13 గ్రీన్‌లో ముగిసాయి. సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రాలు 1.8 శాతం వరకూ తగ్గాయి. పోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికీ భారతి ఎయిర్‌టెల్ షేరు 1.5 శాతం పడిపోయింది. టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్‌లు 1 శాతం మధ్య తగ్గాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, లార్సన్ అండ్ టుబ్రో, హిందుస్థాన్ యూనీలీవర్, హెచ్‌సీఎస్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు 2.3 శాతం వరకూ పెరిగాయి.

వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 1.15 శాతం పడిపోయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.03 శాతం క్షీణించగా, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.92 శాతం, బ్యాంకెక్స్ 0.76 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ 0.48 శాతం చొప్పున తగ్గాయి. ఐటీ, రియల్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండక్స్‌లు పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.71 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57 శాతం చొప్పున క్షీణించాయి. 

ఒడిదుడుకుల్లోనే మార్కెట్

యూఎస్ మాంద్యం ప్రభావం ఐటీ, ఫార్మా రంగాలు, రెమిటెన్సులపై ఉంటుందని, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా రానున్న రోజుల్లో మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే కొనసాగుతాయని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేశ్ షా చెప్పారు.యూఎస్ ఫ్యూచర్లు భారీగా పెరగడంతో దేశీయ మార్కెట్ రిబౌండ్ అయ్యేందుకు ప్రయత్నించిందని, అయితే ఇన్వెస్టర్లు జపాన్ యెన్ బలపడటం, అమెరికా ఆర్థిక గణాంకాల బలహీనత, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. 

మూడు రోజుల్లో రూ.22 లక్షల కోట్లు ఇన్వెస్టర్లు కోల్పోయిన సంపద

వరుస మూడు రోజుల్లో జరిగిన మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు రూ.22 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. ఆగస్టు 1న 82,129 పాయింట్ల ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని నమోదు చేసిన సెన్సెక్స్ శుక్ర, సోమ, మంగళవారాల్లో 3,275 పాయింట్లు నష్టపోయింది. దీంతో బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.22,02,996 కోట్లు తగ్గి రూ.4,39,59,953 కోట్లకు (5.24 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది.