- కేంద్ర ప్రభుత్వం ప్రకటన
- కాదు నష్టమన్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: లోక్‌సభలో జమిలి బిల్లును కే్రందం ప్రవేశపెట్టింది. 129 రాజ్యాంగ సవరణ బిల్లు, మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ మంగళవారం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ సహా ఇండియా కూటమి పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. ఎన్డీయే కూటమి బిల్లుకు మద్దతు ప్రకటించాయి. ఈక్రమంలో బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా బిల్లుపై వివిధ పార్టీల నేతలు మాట్లాడారు.
20మంది బీజేపీ ఎంపీలకు నోటీసులు
జమిలి బిల్లు నేపథ్యంలో మంగళవారం ఎంపీలందరూ సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. అయినప్పటికీ 20 మంది బీజేపీ ఎంపీలు సభకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీ ఆయా ఎంపీలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
* జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. దీన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలి’
కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ
* రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారు. జమిలి ఎన్నికలు నియంతృత్వ పాలనకు దారి తీస్తాయ.’
ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్
* జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే. ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిది. ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు.. ఎన్నికల సంస్కరణలు. గతంలో ఎన్‌జేఏసీ బిల్లును కూడా ఇలాగే చర్చ లేకుండా ఆమోదించుకున్నారు.ఆ తరువాత మౌలిక స్వరూపానికి ఎన్‌జేఏసీ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసింది. జమిలి ఎన్నికల చట్టం వస్తే దానికీ అదే పరిస్థితి ఎదురవుతుంది.”
టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ
* జమిలీ ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్దం. ఇవి అధ్యక్ష తరహా పానలకు దారితీస్తాయి. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయి.’
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
* ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలి. లేదా దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి.’
ఎన్సీపీ ఎంపీ(ఎస్పీ) సుప్రయా సూలే
* ప్రతిపక్షాలకు సంస్కరణలంటే అలర్జీ. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. బిల్లు కు మేం పూర్తిగా మద్దతు ఇస్తున్నాం.’
శివసేన ఎంపీ శ్రీకాంంత్ శిండే
* సృజనాత్మక ఆలోచలనకు టీడీపీ ఎప్పుడు మద్దతిస్తుంది. సహకార, సమాఖ్య తత్వానికి మేం అనుకూలం.
కేంద్రమంత్రి చంద్రశేఖర్
కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన షా
కాంగ్రెస్‌పై హోం మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. రాజ్యసభలో రాజ్యాంగంపై రెండో రోజు చర్చలో భాగంగా మట్లాడిన ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని ప్రశంసించా రు. అప్పట్లో ఆయన చేసిన కృషి వల్లే భారత్ మహోన్నత దేశంగా ఆవిర్భవించిందన్నారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాం గం మరింత బలం చేకూర్చిందన్నారు. నియంతృత్వ అహంకారంతో విర్రవీగిన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
కళ్లద్దాలు పరాయి దేశానివైతే.. భారతీయత ఎప్పటికీ కనిపించదని రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. వాక్ స్వాతంత్య్రపు హక్కును కాలరాసేందుకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ సవరణ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో 77సార్లు రాజ్యాంగ సవరణ జరిగిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను పెంచారని ఆరోపించారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ముస్లిం మహిళల హక్కులను కాంగ్రెస్ కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రతిరాష్ట్రంలో యూసీసీని తీసుకొస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ ఫేక్ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతోందని ఆరోపించారు.
జమిలీ ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదు. 1983 నుంచి ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది. దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం కాదు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదు. స్వీడన్, జర్మనీ వంటి దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ కోణంలోనే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్‌వాల్