calender_icon.png 25 October, 2024 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జానపదాలలో.. ప్రభంజనం..

28-05-2024 12:05:00 AM

ప్రభ.. ఆమె ఏ పాప్ స్టారో.. సినీ నేపథ్య గాయనో కాదు. ఓ సాధారణ కుటుంబానికి చెందిన పేదింటి అమ్మాయి. వ్యవసాయం, కూలీ పనులే జీవనాధారం. ఇదీ ఆ కుటుంబ పరిస్థితి. 

వాళ్లది రంగరెడ్డి జిల్లా యాచారం గ్రామం. అమ్మాయిలకు చదువు అవసరమన్న ఊహే తెలియని తల్లిదండ్రులు. చిన్నతనం నుంచి చదువులోను, ఆటపాటల్లోను ముందుండేది. ప్రభకు చిన్నతనం నుంచీ పాటలంటే ఇష్టం. స్కూల్లో.. గ్రామంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా పాల్గొనేది. ఆమె గొంతు విని అందరూ మైమరచిపోయేవారు. అలా మొదలైన ఆమె సంగీత ప్రయాణం పక్క ఊళ్లకీ పాకింది. ప్రభ అంటే ఒక సింగర్ అనే గుర్తింపు లభించింది. అలా జానపదాలే ఆమె ప్రపంచంగా మారిపోయాయి. 

‘సిటా పటా సినుకులకు నువ్ యాడ తిన్నవ్ రో రాతిరి’ అనే మొదటిపాటతోయూట్యూబ్‌లో సంచలనమైంది. ప్రభకు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే! యూట్యూబ్‌లో లక్షల్లో ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారు. దానిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆమెకున్న క్రేజ్ ఏంటో.. అద్భుతమైన ఆమె ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ‘విజయ’తో పంచుకున్నారామె.. 

మాది వ్యవసాయ కుటుంబం. అమ్మనాన్న ఇద్దరు కూలీ పనిచేస్తారు. మేం ముగ్గురం. అక్క, తమ్ముడు, నేను. మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడ్డారు మా తల్లిదండ్రులు. రోజులో రెండుపూటల తిన్న రోజులు కూడా ఉన్నాయి. నా చదువంతా మా ఊరు యాచారం ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. తర్వాత ఇబ్రహీంపట్నంలో ఇంటర్మీయట్ చదివాను. డిగ్రీ పూర్తిగా చదవలేకపోయాను. తర్వాత పెళ్లి.. పిల్లలు.. కుటుంబ బాధ్యతల్లో పడిపోయాను.  

ఊర్లో బాగా వైరల్ అయ్యా..

స్కూల్లో ఉన్నప్పుడు మామూలుగా దేశభక్తి గీతాలు పాడుతుండేదాన్ని.. అప్పుట్లో ఫోక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ ఎక్కువగా వినిపిస్తుండేవి. నీ వాయిస్ అయితే బాగుంటుదని తెలుగు టీచర్ శ్రీనివాస్ సర్, స్కూల్లో టీచర్లలందరు ప్రోత్సహించేవారు. గీ పాటలు పాడు అని.. అవి రాసిచ్చి, నేర్పించేవారు. అలా ఆ పాటలను స్కూల్లో ఏమన్న అకేషన్స్, ప్రోగామ్స్ అయినప్పుడు పాడేదాన్ని.

ఆ విధంగా నేను మా ఊర్లో వైరల్ అయ్యాను. మా ఊర్లో పేద విద్యార్థులు, బాగా చదువుకునే పిల్లలకు ప్రతి ఏడాది ఎస్‌బీఐ వాళ్లు ఐదు వేలు ఇచ్చేవారు. అలా మా మండలంలో నాకు ఒక రెండు ఏండ్లు ఇచ్చారు. ఎనిమిదో తరగతిలో ఏమ్‌ఆర్వో ఆఫీస్‌లో నాకు ఒక స్టడీ బుక్స్, స్టడీ టేబుల్ ఇచ్చారు. ఇలా ఊరి పెద్దలు సన్మానించడం, బ్యాంకు వాళ్లు, టీచర్ల ప్రోత్సహం వల్ల సింగర్‌గా నాకు ఊర్లో గుర్తింపు వచ్చింది. అలా అందరు గణేష్‌లు, బతుకమ్మల దగ్గర బాగా పాడించేవారు. 

మ్యూజిక్ ట్రాక్ పై నా పాట..

ఆ సమయంలో మా ఆయన ఒకే ఒక్క మాట అన్నారు. ‘ఏం కాదు నువ్వు పాడాలి.. పేరు కోసమని కాదు కానీ మ్యూజిక్ ట్రాక్ పైన నీ పాటను నేను వినాలి’ అన్నారు. సరే ఎవ్వరు నిన్ను పాడించుకోకపోతే ఏంటి.. నేనే పాడించుకుంటా అని అన్నారు. నువ్వు పాడగలవు, నీకు పేరుంది కదా అన్నారు. అది అక్కడితోనే ఆగిపోకూడదు. నాకు తెలిసిన వాళ్లు అప్పుడప్పుడే యూట్యూబ్‌కి వస్తున్నారు. మనకు అవకాశం రానప్పుడు మనమే ప్రయత్నిద్దామని మ్యూజిక్ డైరెక్టర్‌ల కోసం మా ఆయన ట్రై చేశారు. అప్పుడే బచ్చలకూర సురేష్ అన్నా తగిలారు.

ఏం పాటలు ఉన్నాయి అని అడిగారు. రెండు ఉన్నాయని పంపిస్తే.. రెండు బాగున్నాయని చెప్పారు. అప్పుడే అన్న చెప్పాడు పాటలు పాడటానికి ఒక ఛానెల్ ఉండాలి.. మ్యూజిక్ సిస్టమ్ ఉండాలి.. అదంతా మీకు అవసరం లేదని చెప్పారు. అలా నా పాటలను అమూల్య స్టూడియోస్ వేణు అన్నకు పంపించారు. అలా పంపిస్తే అన్న రెండు పాటలు తీసుకున్నారు. స్టూడియోలో నేను పాటలు పాడుతుంటే.. నువ్వు యాక్టింగ్ కూడా చేయగలవు అని రెండు పాటలకు నన్నే తీసుకెళ్లాడు. అప్పుడు ప్రసాద్ అన్న, వేణు అన్న బాగా సపోర్టు చేశారు. అలా వాళ్ల ప్రోత్సహంతో రెండు పాటలకు నేనే యాక్టింగ్ చేశాను. నేను మొదట పాడిన పాట ‘సిటా పటా సినుకులకు నువ్ యాడ తిన్నవ్‌రో రాతిరి’ పాటనే నాకు గుర్తింపును తీసుకొచ్చింది.

మాది లవ్ మ్యారేజ్..

నాకు బాగా సంతోషం, బాధ కలిగించిన సందర్భం ఒకటి ఉంది. అదే నా లవ్ మ్యారేజ్. నేను సింగర్‌గా ఎదగాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నేను పాటలు పాడటం వద్దనుకున్నప్పుడు.. మళ్లీ మా ఆయన ప్రోత్సహించడం.. అందులోకి మళ్ల్లీ రావడం జరిగింది. ఇంతలా నా పాటలు హిట్ అవుతాయని మేం అసలు ఊహించలేదు. అలా పాటలు పాడుతున్న క్రమంలోనే నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అని తెలిసిన తర్వాతనే నేను పాటలు పాడటానికి వెళ్లాను. అదే పాట సూపర్ హిట్ కావడం..

నా బిడ్డ నా కడుపులో పడటం జరిగింది. అప్పుడే షూట్, పాట పాడటానికి వెళ్లాను.ఆమె కడుపులో ఎట్లయితే పెరుగుతుందో.. అలాగే నాకు పేరు కూడా వచ్చింది. నిజానికి నా బిడ్డతోనే అన్ని కలిసివొస్తున్నాయి. కొద్దిగా పెళ్లి విషయంలో పెద్దలను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాం. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు. అందరం ఆనందంగా ఉన్నాం. 

ఒడిదుడుకులు సహజం.. అవకాశం కోసం ఎదురు చూశా..

నాకర్థమైంది ఏంటంటే.. ఇండస్ట్రీలో ఒడిదుడుకులు అనేవి చాలామందికి ఉంటాయి. నేను పాడిన వెంటనే నాకు ఫేమ్ వచ్చింది. అది మళ్లీ తగ్గిపోవచ్చు. నా స్థానంలో మళ్లీ వేరే వాళ్లు కూడా రావొచ్చు. నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే.. నీతో పాటలు పాడిస్తానని చెప్పి.. మోసం చేశారు. ఆ పరిస్థితిని నేను ఊహించుకోలేను. ఆ సమయంలో నేను ఇంకా ఇండస్ట్రీకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. అలా కొంతమంది ఉంటారు. నన్ను ఇలా మోసం చేసిన వాళ్లే నాకు మళ్లీ ఫోన్ చేశారు. ఒక పాట ఉంది పాడుతారాని. వాళ్లకు ఒక్కటే మాట చెప్పాను.

నేను పాడనని. నాకు అవకాశం ఇస్తున్నరు కాబట్టే నా పాటలు పంపించాను. ఒక్క అవకాశం కోసం అడిగాను.. కనీసం డబ్బులు కూడా అడగలేదు. ఇప్పుడు ఆ పేర్లను బయట పెడితే బాగుండదు. వాళ్లు చాలా పెద్దవాళ్లు. అందరు వాళ్ల ఐడెంటింటి, పేరు కోసం తండ్లాడుతుంటారు. వాళ్ల పేరు మనమెందుకు కరాబ్ చేయాలి. ఎవ్వరు చేసిందనేది వాళ్లకు తెలిస్తే సరిపోతుంది. నేను ఎక్కడికెళ్లినా మా ఆయన సపోర్టు పూర్తిగా ఉంటుంది.    

తమ్ముడు నాన్నతో సమానం..

మేం చిన్నప్పటి నుంచి గొప్పగా ఏం బతకలేదు. చాలా సామన్యంగా బతికాం. మా తల్లిదండ్రులకు తినడానికి లేకున్న మాకు పెట్టిన రోజులున్నాయి. ఇక మా అమ్మ అయితే అన్నం తినడానికి లేకుంటే.. డికాషన్ పెట్టి, బ్రడ్ ఇస్తే తిని ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో స్కూల్లో టీచర్లు మా అమ్మకు ఇలా చెప్పేవారు. ‘మీ అమ్మాయి బాగా చదువుతుంది. చదివించండి’ అని చెప్పేవారు. అలా ఎస్‌బీహెచ్ వాళ్లు, లోకల్ వాళ్లు బాగా ప్రోత్సహించేవారు. మా నియోజక వర్గం ఎమ్మెల్యే వచ్చినప్పుడు ‘ఆడ పిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ’ అనే పాట పాడితే ఆయన ఒక ఐదు వేలు ఇచ్చి, సన్మానించారు.

అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నాను. కొన్ని పరిస్థితులను ఎదుర్కోలేక ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. కాని ఇంట్లో అమ్మ, నాన్న అందరి సపోర్టు వల్ల బతికిపోయా. ముఖ్యంగా మా తమ్ముడు నాకు నాన్నతో సమానం. నా ఫోన్‌లో కూడా వాడి నెంబర్‌ను డాడీ అని ఫీడ్ చేసుకున్నాను. నాకన్న రెండేళ్లు చిన్న.. అయినా అంతబాగా చూసుకున్నాడు. ఇప్పటికైనా నాకు ఏదైన సమస్య వస్తే మా అమ్మ, నాన్న కన్న ముందు మా తమ్ముడే గుర్తుకొస్తాడు. 

మా ఫ్యామిలీ సపోర్టు..

మా అత్తమ్మ చాలా మంచిది. చాలా సందర్భాల్లో నాకు తోడుగా ఉండేది. నేను పొద్దున్నే మూడు గంటలకు షూట్‌కు వెళ్లాల్సి వస్తే.. ఆమె వంట చేయడం, పిల్లలను చూసుకోవడం చేస్తుంది. ఇక మా మామ అయితే నా కోడలు ఇట్ల, అట్ల అని మస్తు ఇష్టపడతారు. మా పెద్ద ఆడపడుచు నా అదృష్టంగా భావిస్తాను. ఆమె నాకు బాగా సపోర్టు చేస్తుంది. నేను ఏ రికార్డింగ్ వెళ్లినప్పుడయినా ఆమెకు ఫోన్ చేసి పోయేదాన్ని. ఆమె ఫోన్ చేస్తే ఏదో విధంగా నాకు కలిస్తోందనే నమ్మకం ఉంది. అలా ఒకసారి ఒకే రోజు 40 వేల వరకు కూడా డబ్బులు తీసుకొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మా ఫ్యామిలీ సపోర్టు ఉండటం వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది.   

యూట్యూబ్ ద్వారా..

నేను పాటలు బాగా పాడుతానని అందరికి తెలుసు. కానీ మనల్ని మనం నిరూపించుకోవడానికి ఒక వేదిక కావాలి. నేను ఊర్లో పాడితే చుట్టూ పక్కల వాళ్ళకు మాత్రమే తెలిసింది. అప్పుడే యూట్యూబ్ అనేది నాకు ఒక వేదిక అయింది. దాని ద్వారానే ఇవాళ అందరికి సింగర్ ప్రభ అని తెలుసు. అలా యూట్యూబ్‌లో పాడటానికి నాకు చాలా సమయం పట్టింది. నా లాగ పాడేవాళ్లు అప్పటికే చాలామంది ఉన్నారు. నాకెందుకు ఇస్తారు అవకాశం అనుకునేదాన్ని. చాలామందితో చెప్పాను నా దగ్గర కూడా పాటలు ఉన్నాయి, నేను కూడా పాడగలను అని చాలామందికి చెప్పాను.

కానీ ఎవ్వరు అంగీకరించలేదు. పెద్ద పెద్ద ఛానెల్ వాళ్లకు కూడా ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. కొంతమందేమో పాడిస్తామని బాగా తిప్పించు కున్నారు. ఒకనొక సందర్భంలో బాగా విసుగు వచ్చింది. ఇక నేను పాడలేను.. ఎందుకు నాకీ తలనొప్పి అని బాధపడ్డాను. 

నాకు ఇష్టమైన పాట..

నన్ను చిన్నతనం నుంచే అందరూ సింగర్, సింగర్ అని పిలిచేవారు. ‘ఆడ పిల్ల నమ్మ నేను ఆడపిల్లనమ్మ అనే పాట చాలా ఫేమస్ అప్పట్లో. నేను ఆ పాట పాడాను. అప్పటి నుంచి నన్ను కూడా అందరు ‘మధు టూ.. మధు టూ’ పిలిచేవారు. నేను ఇప్పటి వరకు దాదాపు 270 వరకు పాటలు పాడాను. 270 పాటల్లో నాకు బాగా నచ్చిన పాట, నాకు కనెక్టు అయినా పాట అంటే ‘మంచె దిగు.. మంచె దిగు’ అనే పాట ఇష్టం. ఎందుకంటే ఆ పాట మొదటి నుంచి మెలోడియస్‌గా ఉంటుంది. ‘రింగు జుట్టులోడ’, ‘కోమటోళ్ల వెంకటి’ పాటలు కూడా బాగా ఇష్టం.