ముషీరాబాద్,(విజయక్రాంతి): ప్రతి మాదిగ ‘ఆది పురుషుడు ధర్మం’ సమాలోచనలో భాగస్వాములు కావాలని ఆదిపురుష సమాజం ప్రచార ప్రధాన ధర్మకర్త ప్రొఫెసర్ ఏకు తిరుపతి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్యకేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ‘ఆది పురుషుడు ఆది ధర్మం’ గ్రంధావిష్కరణ సన్నాహక కమిటీ ఎజెండాతో మాదిగ ఉప కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను పలువురితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సృష్టిలో మాదిగల విశిష్టత, వారి జీవన ప్రయాణం సమాజిక స్థితిగతులపై సమాలోచన చేయాల్సినవసరం ఉందన్నారు. మాదిగల పవిత్ర గ్రంథం ‘ఆది పురుషుడు ఆది ధర్మం’ యొక్క విశిష్టతను రాబోయే తరాలకు అందించాలని, ప్రతి యువతను ఈ గ్రంథాన్ని చదివిస్తూ ఆది జాంబవ మహాముని ప్రకృతికి అందించిన శక్తిని పరిచయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉప కులాల ప్రతినిధులు ఇటిక రాజు, సంగీతం రాజలింగం, నవీన్ రాజు తదితరులు పాల్గొన్నారు.