calender_icon.png 17 October, 2024 | 6:01 AM

ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి

17-10-2024 03:20:08 AM

వైస్ చైర్మన్‌గా ఐ.పురుషోత్తం

బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీగా గోవర్థన్

మహిళా వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా ధనావత్ సూర్య

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మిగతా వర్సిటీలకు త్వరలోనే నూతన వీసీలు

నియామక ప్రక్రియలో వేగం పెంచిన ప్రభుత్వం

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్ నియమించింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, వైస్‌చైర్మన్‌గా ఇటిక్యాల పురుషోత్తం నియ మితులయ్యారు. ఈ నియమకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరు మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగనున్నా రు. ప్రస్తుతం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి, వైస్‌చైర్మన్‌గా ప్రొ ఫెసర్  వెంకటరమణ కొనసాగుతున్నారు.

వీరు దాదాపు ఏడేళ్లుగా  కొనసాగుతున్నారు. వీరి స్థా నాల్లో బాలకిష్టారెడ్డిని, పురుషోత్తంను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. యూని వర్సిటీ వీసీల నియామకం కంటే ముందే చైర్మ న్, వైస్ చైర్మన్‌ను నియమించారు. ఇదిలాఉంటే గురువారం మధ్యాహ్నం విద్యామండలి చైర్మన్ గా బాలకిష్టారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. పురుషోత్తం గురువారం లేదా శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

రెండు వర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలు..

ప్రభుత్వం రెండు యూనివర్సిటీలకు మాత్ర మే ఇన్‌చార్జి వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రొఫెసర్ వెంకట రమ ణ బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీగా, ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ కొనసాగుతు న్నారు. ఆయన స్థానంలో బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీగా జేఎన్టీయూ ప్రొఫెసర్ గోవర్థన్‌ను, ఐ.పురుషోత్తంను ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా  నియమించారు. అలాగే కోఠిలోని  వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూని వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ ధనావత్ సూర్యను నియమించారు. 

త్వరలోనే మిగితా వర్సిటీలకు వీసీలు..

రాష్ట్రంలోని యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీ, మహిళా వర్సిటీ వీసీలను నియమించిన ప్రభుత్వం త్వరలోనే ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శా తవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, జేఎన్టీ యూ, తెలుగు (సురవరం ప్రతాపరెడ్డి) యూనివర్సిటీ, జేఎన్‌ఏఎఫ్‌ఏయు (ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ), బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలకు నియమించనుంది.

అయితే అంబేద్కర్ వర్సిటీ, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీల సెర్చ్ కమిటీల సమావేశాలు ఇంకా జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ రెండు యూనివర్సిటీలు మినహా మిగిలిన వర్సిటీలకు వీసీలను నియమించనున్నట్లు విద్యా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈమేరకు గవర్నర్ కార్యాలయానికి వీసీల ఫైల్ చేరినట్లు సమాచారం. వీసీల నియామకంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా వీసీలను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి గురించి..

నాగర్  కర్నూల్  జిల్లా తాడూర్ మండలం పర్వతాయపల్లి గ్రామానికిచెందిన బాలకిష్టారెడ్డి ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు.  ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం, జేఎన్‌యూలో ఎం.ఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆయన నల్సార్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ప్రస్తుతం మహీంద్రా యూనివర్సిటీ లా డీన్‌గా ఉన్నారు. ఆయనకు బోధన, పరిశోధనా రంగాల్లో 20 ఏండ్ల అనుభవం ఉంది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెరిటోరియస్ టీచర్ అవార్డును అందుకున్నారు.   

 ట్రిపుల్ ఐటీ వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్

ఎస్సీ సమాజిక వర్గానికి చెందిన గోవర్ధన్  జేఎన్టీయూహెచ్ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఎంసెట్ కన్వీనర్‌గా, పరీక్షల నిర్వహణపై ఆయనకు అనుభవం ఉంది.  ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా చేశారు.  

ప్రొఫెసర్ ఐ.పురుషోత్తం..

ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈయన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల. నారాయణగూడలోని భవన్స్ న్యూసైన్స్ కాలేజీలో డిగ్రీ ఉన్నత విద్యను అభ్యసించారు. నిజాం కాలేజీలో పీజీ (ఎంఏ ఎకనామిక్స్) పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంఫిల్‌లో గోల్డ్ మెడల్, పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. కొంత కాలం ఆర్‌టీసీలో ఉద్యోగం చేశారు.

ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీ అర్థశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘ఇగ ఊకోం’ అనే పాటతోపాటు మాయని గాయాలు, తెలంగాణ పునాది రాళ్లు, దారి తప్పిన దళిత ఉద్యమాలు పుస్తకాలు రాశారు. తెలంగాణ రాష్ట్ర పోరాట సమితి స్థాపనలో ఆయన పాత్ర ఉంది. టీజేఏసీ కన్వీనర్, చైర్మన్‌గా పనిచేశారు.

మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సూర్య..

ఈమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈమె నల్గొండ జిల్లా మిర్యాల గూడ మండలం భల్లు నాయక్ తండాలో జన్మించారు. తెలుగు సాహిత్యకారిణి, తెలుగు శాఖలో ప్రొఫెసర్. ఆమెకు ఉస్మానియా వర్సిటీ తెలుగు శాఖ విభాగాధిపతిగా పనిచేసిన అనుభవం ఉంది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ సాహిత్యకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం, 2024లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పురస్కారం అందుకున్నారు.

మిర్యాలగూడలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తిచేశారు. ఇంటర్ ఫస్టియర్‌లోనే ఆమెకు వివాహం జరిగింది. అనంతరం బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ నుంచి బీఏ పూర్తి చేసి ఉస్మానియా నుంచి ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ‘నల్గొండ జిల్లా సాహిత్యం చిత్రణ’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. అనంతరం ఉస్మానియా వర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా, సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.